కేఆర్ఎంబీ విషయంలో ప్రభుత్వ మెడలు వంచినం : హరీశ్ రావు

కేఆర్ఎంబీ విషయంలో ప్రభుత్వ మెడలు వంచినం : హరీశ్ రావు
  • మా పార్టీ పోరాటం వల్లే ప్రాజెక్టులు అప్పగించబోమని తీర్మానం 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేఆర్ఎంబీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రాజెక్టులను అప్పగించబోమని తీర్మానం చేయించామని బీఆర్ఎస్  ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియా పాయింట్  వద్ద ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్​ ఒత్తిడికి తలొగ్గి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని కాం గ్రెస్  ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం తమ పార్టీ పోరాట ఫలితమే అన్నారు.

కేఆర్ఎంబీని అప్పగిస్తామని జనవరి 17,  ఫిబ్రవరి 1వ తేదీన కాంగ్రెస్​ ప్రభుత్వం ఒప్పుకొని వచ్చిందని, బీఆర్ఎస్​ పార్టీ ఒత్తిడికి తలొగ్గి తీర్మానం చేసిందని చెప్పారు. తాము గొంతు విప్పాకే అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. అలాగే, ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వ వైఖరి నిలదీశామని, ప్రతిపక్షం మీద దాడి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాగ్  పనికిరాదని తాము అనలేదని, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  అలా అన్నారని చెప్పారు. దివంగత సీఎం రాజశేఖర్  రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్  రెడ్డి కూడా కాగ్ ను తప్పుపట్టారని గుర్తుచేశారు.

అదే కాగ్  తమను ఎన్నోసార్లు మెచ్చుకుందన్నారు. ‘‘ప్రాణహిత టెండర్లు వేయకుండానే పనులు ప్రారంభించారని కాగ్  కాంగ్రెస్​ను తిట్టింది. ప్రభుత్వం పెట్టింది వైట్ పేపర్ కాదు ఫాల్స్  పేపర్. లోక్ సభ ఎన్నికలు వస్తున్నాయని నాలుగు సీట్ల కోసం మేడిగడ్డని భూతద్దం పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాకాలం లోపు రిపేర్లు చేయించి రైతులకు నీళ్లు అందించాలి. లేదంటే రైతులు ఆగం అవుతారు.

అప్పుడు కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు. తమను ఇరికించబోయి సెల్ఫ్ గోల్  చేసుకున్నారు. స్థిరీకరణ, ఆయకట్టు  విషయంలో వాస్తవాలు దాచిపెట్టారు. గ్యారంటీలు అమలు చేయలేక మేడిగడ్డ అంటున్నారు. ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్  పాలిటిక్స్  చేస్తున్నారు” అని హరీశ్  వ్యాఖ్యానించారు.తెలంగాణ ఉద్యమంలో లేని నిర్భంధం పోలీసులు మీడియా పాయింట్​వద్ద ప్రయోగిస్తున్నారని హరీశ్​రావు ఆరోపించారు.