
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ టూర్‌ను బాయ్‌కాట్ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మోదీ వరంగల్ పర్యటనలో తాము పాల్గొనబోమన్నారు. ‘‘ప్రధాని పదవి చేపట్టిన రోజు నుంచే తెలంగాణపై వ్యతిరేకత నింపుకున్న వ్యక్తి మోదీ. ఆయనకు తెలంగాణపై ఇంత ద్వేషం, వ్యతిరేకత ఎందుకు ఉందో తెలియడం లేదు” అని కేటీఆర్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మంత్రులు జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో కలిసి మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఏపీ విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే దాన్ని గుజరాత్‌లోని దాహోడ్కు తరలించుకుపోయారని, రూ.20 వేల కోట్లతో అక్కడ లోకో మోటివ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణకు మాత్రం రూ.520 కోట్లతో కోచ్‌ల రిపేర్ల ఫ్యాక్టరీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.
ప్రధాని టూర్‌ను బాయ్‌కాట్ చేస్తున్నం
రేవంత్‌రెడ్డి వంద శాతం ఆర్ఎస్ఎస్, బీజేపీ మనిషి అని కేటీఆర్ ఆరోపించారు. ‘‘గాంధీ భవన్లో గాడ్సే దూరిండని రేవంత్ పీసీసీ చీఫ్అయినప్పుడే మేం చెప్పాం. బీజేపీ, ప్రధాని మోదీని పల్లెత్తు మాట అనకుండా రేవంత్ కాపాడుతున్నాడు. ధరణి పోర్టల్విదేశీ చేతుల్లో ఉందన్న రేవంత్‌రెడ్డి.. అసలు కాంగ్రెస్‌పార్టీనే విదేశీ చేతుల్లో ఉందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. రేవంత్నోట్లో నుంచి వేల కోట్లు తప్ప ఇంకో మాటే రాదు. ఆయనకు మతిస్థిమితం లేదు. సెక్రటేరియెట్కింద కూడా వేల కోట్లు ఉన్నాయని పిచ్చి ఆరోపణలు చేసిన సంగతి అందరికీ తెలుసు. రేవంత్ దగ్గర ఏవైనా ఆధారాలుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇచ్చి విచారణ చేయించుకోవచ్చు” అని సవాల్ చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన రేవంత్.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్లు చేయించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీపై తలవంచకుండా పోరాటం చేస్తున్నది ఎవరో దేశమంతా తెలుసని చెప్పారు. కేసీఆర్మహారాష్ట్ర పర్యటనలకు అందుకే మంచి స్పందన వస్తోందన్నారు. మోదీ, బీజేపీపై తాము చేసిన విమర్శల్లో కనీసం పది శాతమైనా కాంగ్రెస్చేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసే కరీంనగర్ఎంపీ సీటును గెలుచుకున్నాయని, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీలు కలిసే పనిచేశాయని ఆరోపించారు.
గత ఎన్నికల్లో ప్రజలు వీపు పగలగొట్టిన్రు
కేసీఆర్ పేదల గుండెల్లో ఉన్నారని.. ఆయనను ప్రజలు తిరిగి గెలిపిస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మహాకూటమి పేరుతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు వీపు పగలగొట్టి వెనక్కి పంపారని, తొమ్మిదేండ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తున్న మోదీకి అలాంటి సమాధానమే చెప్తారని అన్నారు. నాలుగేండ్ల క్రితం మోదీని ఇష్టం వచ్చినట్టు తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ఎన్‌డీఏ మీటింగ్‌కు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. నాలుగేండ్లలో ఏపీకి మోదీ ఏమిచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ‘‘రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాదు.. కనీసం ఎంపీ కూడా కాదు. ఆయన్ను ఎవరూ లీడర్‌గా కూడా గుర్తించడం లేదు. ఆయన ఏ హోదాలో రూ.4 వేల పింఛన్ఇస్తామని హామీ ఇచ్చారో చెప్పాలి” అని డిమాండ్ చేశారు. 55 ఏండ్లు రాష్ట్రాన్ని రాబందుల్లా వేధించుకుతిన్న కాంగ్రెస్ పార్టీని ఇక్కడి ప్రజలు నమ్మబోరన్నారు.
సాయిచంద్, జగదీశ్ కుటుంబాలకు రూ.1.50 కోట్ల చొప్పున సాయం
ఇటీవల మృతిచెందిన వేర్హౌసింగ్కార్పొరేషన్ వేద సాయిచంద్, ములుగు జెడ్పీ చైర్మన్కుసుమ జగదీశ్కుటుంబాలకు రూ.1.50 కోట్ల చొప్పున సాయం అందజేస్తామని కేటీఆర్ప్రకటించారు. ఉజ్వల భవిత ఉన్న ఇద్దరు యువ నాయకుల అకాల మరణం పార్టీకి తీరని నష్టమన్నారు. వారిద్దరి కుటుంబ సభ్యుల యోగక్షేమాల కోసం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నెల జీతం రూ.3 కోట్లకు పైగా ఇద్దరి కుటుంబాలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్నిర్ణయించారని తెలిపారు. సాయిచంద్, జగదీశ్ ల తల్లిదండ్రులను కూడా పార్టీ తరపున ఆదుకుంటామన్నారు. సాయిచంద్భార్యకు వేర్హౌసింగ్కార్పొరేషన్చైర్పర్సన్పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. అంతకుముందు సాయిచంద్, జగదీశ్‌ల మరణానికి సంతాపం తెలిపారు.