
- తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శం: హరీశ్ రావు
- మా స్కీమ్‌లను చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నయ్..
- దేశాభివృద్ధికి కేసీఆర్ లాంటి నాయకుడు అవసరమని వ్యాఖ్య
- సోలాపూర్‌లో మార్కండేయ రథోత్సవంలో మంత్రి
హైదరాబాద్, వెలుగు : అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. మహిళలు, రైతులు, యువతతో కూడుకున్న పార్టీ తమది అని అన్నారు. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణ స్కీమ్‌లను కాపీ కొడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ మాదిరి అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు అవసరమని చెప్పారు. బుధవారం హెలికాప్టర్లో మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి హరీశ్ రావు మహారాష్ట్రలోని సొలాపూర్ వెళ్లారు. పద్మశాలీల ఆధ్వర్యంలో నిర్వహించిన మార్కండేయ రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
మార్కండేయ ఆలయ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం కోటి విరాళం ప్రకటించారని వెల్లడించారు. వందేండ్ల చరిత్ర ఉన్న మార్కండేయ పురాతన ఆలయంలో ప్రతి రాఖీ పౌర్ణమికి రథయాత్ర నిర్వహించడం బాగుందన్నారు. ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం సంతోషంగా ఉందని తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు కలిసిమెలిసి తమ ఐక్యత చాటుకోవాలన్నారు. ఆ తర్వాత సొలాపూర్‌లో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కోసం బాల్కోటి, ఈద్గా గ్రౌండ్లను మహమూద్ అలీ, ఎల్.రమణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. దేశంలోనే ఎక్కువ రైతుల ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే జరుగుతున్నాయన్నారు.
దీనికి కారణం ఏంటో చెప్పాలని అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడున్న పాలకులు తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ పోరాటంతో తెలంగాణ సాధించుకుని.. ఇప్పుడు అద్భుతంగా అభివృద్ధి చేసి చూపించామన్నారు. మహారాష్ట్రలో మరింత అభివృద్ధి జరగాలంటే.. కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.