హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ పదే పదే రేవంత్ రెడ్డిని రెన్యూవల్ ముఖ్యమంత్రి అని అనడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి రెన్యూవల్ ముఖ్యమంత్రేనని.. తెలంగాణ ప్రజల ఆమోదంతో ఐదేండ్లకోసారి సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఆయన ఆదివారం సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ పనిపాట లేకుండా పర్యటనలు చేస్తున్నాడని, ఆయన ఎన్ని యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీది మూడో స్థానమేనని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు బొమ్మ చూపించారని, ఇక రాబోయే రోజుల్లో చుక్కలు చూపిస్తారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎవరూ చేయని అభివృద్ధిని సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో చేస్తున్నారని తెలిపారు. కేటీఆర్ అసహనంతోనే సీఎంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
