- 27న హనుమకొండలో 10 వేల మందితో భారీ ప్రదర్శన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు ఇల్లు, ఇంటి స్థలం సాధించడమే లక్ష్యంగా వామపక్ష పార్టీలు మరో మహత్తర పోరాటానికి సిద్ధమయ్యాయి. గతంలో జరిగిన విద్యుత్ ఉద్యమం తరహాలో ఇండ్ల పోరాటాన్ని ఉధృతం చేయనున్నట్లు సీపీఐ, సీపీఎంతో సహా పలు వామపక్ష పార్టీల నేతలు ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్ధూం భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పోరాట కార్యాచరణను వెల్లడించారు.
హన్మకొండ జిల్లా గుండ్ల సింగారంలోని గోపాల్ పూర్లో తొలగించిన గుడిసెల స్థానాల్లో పేదలకు ఇళ్ల కట్టించాలని డిమాండ్ చేస్తూ 10 వేల మందితో 27న హన్మకొండలో భారీ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో వైఎస్సార్ హయాంలో పట్టాలిచ్చిన భూముల్లో.. ఇప్పుడు కూల్చివేతలు చేపట్టడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడైతే గుడిసెలు కూల్చారో అక్కడే తిరిగి ఇళ్లు కట్టించి ఇచ్చే వరకు పోరాడతామని హెచ్చరించారు.
జూలై 1న కలెక్టరేట్ల ముట్టడి
ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం జూలై 1న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్దఎత్తున ముట్టడి, నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు కూనంనేని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదల నుంచి దరఖాస్తులను సేకరించి జూలై 6న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద వేలాది మందితో ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దరఖాస్తులను నేరుగా సమర్పిస్తామన్నారు. ఈ గుడిసెల పోరాటానికి ఏ పేరు పెట్టాలనేది జూలై 2న నిర్ణయించనున్నట్లు వెల్లడించారు. సీపీఎం నేత అబ్బాస్ మాట్లాడుతూ.. పేదలపై బుల్డోజర్లు ఎక్కించడం ప్రభుత్వానికి తగదన్నారు.
జగిత్యాల, హనుమకొండ ప్రాంతాల్లో అక్రమ కేసులు పెట్టి పేదలను జైళ్లకు పంపడాన్ని ఖండించారు. సుధాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా బాబులు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, వారి చిట్టా ఇస్తామని దమ్ముంటే వారిపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ నేతలు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటీ నరసింహ, పశ్య పద్మ, న్యూడెమోక్రసీ నాయకులు గోవర్ధన్, ఎంసీపీఐ నేత సుధాకర్ పాల్గొన్నారు.
