- ప్రైవేటు కంపెనీలకు 9,292 ఎకరాలు ధారాత్తం చేసే కుట్ర: కేటీఆర్
- మార్కెట్ ధరతో సంబంధం లేకుండా అప్పగిస్తున్నది
- భూములు.. కాంగ్రెస్ జాగీరు కావని ఫైర్
- విద్యా రంగ సమస్యలపై ఉద్యమించాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: కోట్ల రూపాయలు దోచుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీని తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ స్కీమ్ ద్వారా 9,292 ఎకరాల భూమిని ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, రూ.5 లక్షల కోట్ల స్కామ్‌కు తెరదీసిందని విమర్శించారు. బీఆర్ఎస్వీ విభాగం నేతలతో ఆయన నందినగర్‌లోని తన ఇంట్లో మంగళవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘గతంలో ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాల కోసం ప్రజల నుంచి సేకరించిన ప్రభుత్వ భూమిని తక్కువ ధరకి పారిశ్రామికవేత్తలకు గత ప్రభుత్వాలు ఇచ్చాయి. అప్పటి మార్కెట్ రేట్‌కి సంబంధం లేకుండా అత్యంత చవకగా ఈ భూములను కట్టెబెట్టాయి. ఒకప్పుడు పరిశ్రమల కోసం, ప్రజల ఉపాధి కోసం ఇచ్చిన భూములను.. ఈరోజు ప్రైవేటు వ్యక్తులు అపార్ట్‌మెంట్లు కడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తున్నది.
మా ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన గ్రిడ్ పాలసీలో భాగంగా 50% ఐటీ ఆఫీసులకు, మిగిలిన 50% ఇతర అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వానికి తగిన ఫీజులు కట్టిన తర్వాత అవకాశం ఇచ్చాం.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల లాభం కోసమే ఆ భూములను కట్టబెడుతున్నది. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలో 30%చెల్లిస్తే చాలు అంటూ అప్పనంగా అప్పగిస్తున్నది’’అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ భూములేవీ కాంగ్రెస్ ప్రభుత్వ జాగీరు కాదని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు.
విద్యారంగాన్ని పట్టించుకుంటలే
కాంగ్రెస్ ప్రభుత్వం.. విద్యా రంగాన్ని పట్టించుకోవడం లేదని, దీనిపై విద్యార్థులు ఉద్యమించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పదేండ్లలో విద్యారంగం అద్భుతంగా అభివృద్ధి చెందిందని, ఇప్పుడు ఆ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం విద్యార్థి విభాగం వచ్చే నెల నుంచి విద్యార్థి రణభేరి చేపట్టాలని సూచించారు. ‘‘ప్రతి విద్యార్థికీ సోషల్ మీడియా ఖాతా ఉండాలి. సమకాలీన రాజకీయాలపై యువత గట్టిగా స్పందించాలి.
విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలి. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. తెలంగాణ చరిత్రలో దీక్షా దివస్ నవంబర్ 29 మహా ఘట్టంగా నిలిచిపోతది’’అని కేటీఆర్ అన్నారు. దీక్షా దివస్‌ను అన్ని వర్సిటీలు, కాలేజీల్లో ఘనంగా నిర్వహించాలని సూచించారు.
