
- మా అభ్యర్థికి 50వేల కన్నా మెజార్టీ తగ్గితే నేను రాజకీయ సన్యాసం తీస్కుంట
- సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
- పచ్చని పొలాల్లో ఫార్మా చిచ్చు పెడ్తున్నరు
- రైతు భరోసా ఏమైంది? రుణమాఫీ సంగతేమైందని ప్రశ్న
కోస్గి, వెలుగు: కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తమ అభ్యర్థిపై పోటీ చేసి గెలవాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తమ అభ్యర్థికి 50 వేలకు ఒక్క ఓటు తక్కువ మెజారిటీ వచ్చినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. ‘‘దమ్ముంటే రేవంత్‌రెడ్డీ..! కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ రా! ఎవరు గెలుస్తరో చూద్దాం. మా పట్నం నరేందర్‌రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లనే కూసుంటడు.. బయటికి కూడా రాడు. ఆయన గెలువడమే కాదు, 50 వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం తీసుకుంట. రాజకీయంలనే ఉండ. నా సవాల్‌కు సిద్ధమా” అని ఆయన ప్రశ్నించారు.
సోమవారం నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘రైతు నిరసన దీక్ష’’లో కేటీఆర్ మాట్లాడారు. రైతులను సీఎం రేవంత్‌రెడ్డి అడుగడుగునా మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘అధికారంలోకి వస్తే ఎకరాకు రూ. పది వేలకు బదులు 15 వేల పెట్టుబడి సాయం ఇస్తామని నమ్మబలికి చేస్తున్నది ఏమిటి? అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో వంద శాతం రైతులకు రైతుభరోసా వేసిన పాపాన పోలేదు.
మొదట రూ.15 వేలు ఎకరాకు చెల్లిస్తానని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి.. వానాకాలం సీజన్ ముగిసినా రైతు భరోసా ఇవ్వలేదు. చివరికి రైతుభరోసా మొత్తాన్ని రూ.12 వేలకు తగ్గించినా అది కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నడు” అని ఆయన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల టైమ్‌లో గొప్పలు చెప్పారని, అధికారంలోకి వచ్చి ఏడాదైనా రుణమాఫీ పూర్తి చేయలేదని దుయ్యబట్టారు.
భూములు గుంజుకుంటున్నరు
‘‘మార్పు తీసుకోస్తామని రేవంత్‌రెడ్డి చెప్తే.. మా ప్రాంత బిడ్డనేనని ఇక్కడి వాళ్లు గెలిపిస్తే ఏం చేసిండు? లగచర్ల అమాయక ప్రజల భూములను గుంజుకుంటున్నరు” అని కేటీఆర్ ఆరోపించారు. ‘‘ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న పచ్చని పొలాల్లో ఫార్మా చిచ్చురేపి.. అదానీకి ఇస్తా, అల్లుడికి ఇస్తానని రైతుల్ని రేవంత్‌రెడ్డి వేధిస్తే ఖబడ్దార్” అని హెచ్చరించారు. ఫార్మా కంపెనీలకు భూములు ఇవ్వబోమని నిరసన తెలిపిన రైతులపై అక్రమ కేసులు బనాయించి, దాదాపు రెండు నెలలు జైళ్లలో పెట్టారని కేటీఆర్ అన్నారు. లగచర్ల రైతులకు అండగా నిలిచిన పట్నం నరేందర్ రెడ్డిని కూడా అక్రమ అరెస్టు చేసి జైల్లో పెట్టారని తెలిపారు.
లగచర్ల, రోటితండా, హకీంపేట్, దుద్యాల రైతుల అక్రమ అరెస్టులపై ఢిల్లీ దాకా వెళ్లి వారికి అండగా నిలిచి, జైలు నుంచి విడిపించేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడింది. కొడంగల్ రైతులను విడిపించే క్రమంలో తన భర్త కోసం 9 నెలల నిండు గర్భిణి జ్యోతి కూడా ఢిల్లీకి బయలుదేరింది.. ఈ సమయంలో వద్దని వారించినా వినకుండా ఢిల్లీకి వచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు తన బాధను చెప్పుకుంది. ఆమె త్యాగం మరువలేనిది” అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆడబిడ్డ పుడితే.. ‘అన్న నా బిడ్డకు పేరు నువ్వే పెట్టాలి’ అని జ్యోతి కోరింది. నేను మూడు పేర్లు సూచిస్తా.. అందులో నీ ఇష్టమైన పేరు నువ్వే పెట్టుకోవాలని చెప్పిన. భూమి, అవని, ధాత్రి అని సూచించగా.. భూమి అని పేరు పెట్టుకోవడం సంతోషకరం” అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, సవిత ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.