ఓట్ల కోసమే రైతు భరోసా..ఎన్నికలు అయిపోతే మళ్లా ఇయ్యరు: కేటీఆర్

ఓట్ల కోసమే రైతు భరోసా..ఎన్నికలు అయిపోతే మళ్లా ఇయ్యరు: కేటీఆర్
  • ఎన్నికలు అయిపోతే మళ్లా ఇయ్యరు: కేటీఆర్
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎన్నికల ముందు ఒక్కసారే వేసింది
  • ఇప్పుడు స్థానిక ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతోందని వ్యాఖ్య
  • నల్గొండ క్లాక్ టవర్ వద్ద బీఆర్​ఎస్ రైతు మహాధర్నా 
  • నల్గొండ క్లాక్ టవర్ వద్ద బీఆర్​ఎస్ రైతు మహాధర్నా

నల్గొండ, వెలుగు: కేసీఆర్ పాలనలో నాట్లు వేసే ముందే రైతుబంధు వేస్తే.. కాంగ్రెస్ పాలనలో ఓట్లప్పుడే రైతుభరోసా వేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నికలు అయిపోయాక మళ్లా బంద్ చేస్తరని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పార్లమెంటు ఎన్నికల ముందు ఒకసారి డబ్బులు వేసి.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల కోసం డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం నల్గొండ క్లాక్ టవర్ వద్ద బీఆర్​ఎస్​ఆధ్వర్యంలో రైతు మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

 కేసీఆర్ హయాంలో 11 విడతల్లో  రూ.73 వేల కోట్లు  రైతుబంధు ఇచ్చామన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే రైతుబంధు రామ్ రామ్ అవుతుందని కేసీఆర్ ఎప్పుడో చెప్పారని.. అన్నట్టే కాంగ్రెస్ అధికారంలోకొచ్చి ఏడాదైనా రైతుభరోసా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్, రైతుబంధు అంటే కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. తమ హయాంలో దేశంలోనే అత్యధిక వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామని, రాష్ట్రంలో వరి పంటలో నల్గొండ అగ్రస్థానంలో ఉందన్నారు. గత పాలకులు టెయిల్ ఎండ్​కు సాగునీరివ్వలేదని, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడంవల్లనే వరి దిగుబడి పెరిగిందని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే ప్రతి రైతుకు సాగునీరందిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల మరణాలు పెరిగిపోయాయని,  రేవంత్ పాలనలో 410 మంది రైతులు, 50 మంది గురుకుల విద్యార్థులు, 35 మంది చేనేత కార్మికులు మరణించారని చెప్పారు. 

మోసాలను బయటపెడ్తామనే ధర్నాను అడ్డుకున్నరు..

కాంగ్రెస్ మోసాలను బట్టబయలు చేస్తామన్న భయంతోనే ధర్నాకు అనుమతి ఇవ్వకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అడ్డుకున్నారని కేటీఆర్​విమర్శించారు. సర్కారు కుట్ర పన్ని ధర్నాకు పర్మిషన్ ఇవ్వకపోయినా.. తమ న్యాయమైన కోరికను మన్నించి అనుమతిచ్చిన హైకోర్టుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నల్గొండకు ఏం చేశారో క్లాక్ టవర్ సెంటర్ కొచ్చి చెప్పాలని  కేటీఆర్ మంత్రి కోమటిరెడ్డికి కేటీఆర్​సవాల్ విసిరారు. తమ  ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలు, యాదగిరిగుట్ట గుడి నిర్మాణం, దామరచర్లలో విద్యుత్ పవర్ ప్లాంట్ నిర్మించినట్టు  చెప్పారు. 

తమ హయాంలో నిర్మించిన ఐటీ టవర్ కళ తప్పిందని,  వెంకట్​రెడ్డి వచ్చాక అది తాగుబోతులకు అడ్డాగా మారిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక విధానాలను  అవలంభిస్తున్న ప్రభుత్వంపై  తిరగబడేందుకు నల్గొండ జిల్లా నుంచి నాంది పలకాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైల్లోకి పంపుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే  జగదీశ్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య గాదరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నల్లమోతు భాస్కరరావు, ప్రభాకర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.