ప్రజలు మళ్లీ మోసపోవద్దు.. మమ్మల్ని ఓడించి తప్పు చేశారు : కేటీఆర్​

ప్రజలు మళ్లీ మోసపోవద్దు.. మమ్మల్ని ఓడించి తప్పు చేశారు : కేటీఆర్​
  • మొన్న రాష్ట్రంలో మేం గెలిస్తే మహారాష్ట్రలో విజృంభిస్తుంటిమి
  • ప్రజలను మోసం చేయాలని రేవంత్​ మళ్లీ ప్రయత్నిస్తున్నడు
  • ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు.. 
  • రెండోసారి మోసపోతే అది మోసపోయినోళ్లదే తప్పు
  • హరీశ్​రావు సవాల్​ను రేవంత్​ స్వీకరిస్తే నేనూ రాజీనామాకు రెడీ
  • బీజేపీకి 230 సీట్లే.. మాకు 12 సీట్లు వస్తయ్.. 
  • ఏపీలో మళ్లీ జగన్​ గెలుస్తడని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌ను ఓడించి ప్రజలు తప్పు చేశారని, కొన్ని రోజుల్లోనే తప్పును వాళ్లు తెలుసుకున్నారని బీఆర్‌‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నరు. మరోసారి మోసగించేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నడు. దేవుళ్ల మీద ఒట్లు పెడ్తున్నడు. మళ్లీ కాంగ్రెస్‌కు ఓట్లు వేసి మోసపోతే ఈసారి తెలిసి కూడా ప్రజలు తప్పు చేసినట్టే. మళ్లీ మోసపోవద్దు” అని వ్యాఖ్యానించారు. 

ఒక్కసారి మోసపోతే మోసం చేసినవాడిది తప్పని, రెండోసారి మోసపోతే అది మోసపోయినవాళ్లది తప్పని చెప్పారు.  కాంగ్రెస్ వచ్చి 144 రోజులైందని, ఈ 144 రోజుల్లో ప్రతిరోజూ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ కేసీఆర్‌‌‌‌ను తలుచుకుంటున్నారని, మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. అందుకే కేసీఆర్ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌‌‌‌లో జరిగిన బీఆర్​ఎస్​ ఆవిర్భావ వేడుకల అనంతరం మీడియాతో కేటీఆర్​ చిట్​చాట్ చేశారు. ‘‘ఒక ప్రాంతీయ పార్టీ 24 ఏండ్లు నిలబడడం అంత ఈజీ కాదు. మేం నిలబడ్డామంటే కేసీఆర్, కార్యకర్తలే కారణం. కేసీఆర్ మంచి యాజిటేటర్, అడ్మినిస్ట్రేటర్ అని గతంలో అరుణ్ జైట్లీ కూడా అన్నారు” అని ఆయన తెలిపారు. 

అట్లయితే రాజీనామాకు నేనూ రెడీ

‘‘బస్సు, గ్యాస్, కరెంట్ ఉద్దెర ఇచ్చిన రేవంత్‌‌‌‌రెడ్డి.. పైసలు ఇచ్చే పథకాలకాడ ఉద్దెర మాటలు మాట్లాడుతున్నడు. రేవంత్ ఒక నిలకడలేని మనిషి. గతంలోనూ అనేకసార్లు మాట తప్పిండు. జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల్లో, కొడంగల్‌‌‌‌లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నడు. ఇప్పుడు పథకాల అమలుకు పంద్రాగస్టు డెడ్‌‌‌‌లైన్ పెట్టి మరోసారి ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నడు” అని కేటీఆర్​ దుయ్యబట్టారు. పంద్రాగస్టు లోపు పంటల రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేయాలన్న హరీశ్‌‌‌‌రావు సవాల్‌‌‌‌ను రేవంత్‌‌‌‌రెడ్డి స్వీకరిస్తే, తాను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉంటానని ఆయన అన్నారు.  

తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, ప్రధాని నరేంద్రమోదీ ఇద్దరూ మోసం చేశారని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఆరోపించారు. ‘‘తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి నరేంద్ర మోదీ. విభజన హామీలను అమలు చేయనివ్యక్తి మోదీ. అన్ని వస్తువుల ధరలు పెంచి పేదల నడ్డి విరిచింది మోదీ. ప్రపంచమంతటా క్రూడాయిల్ ధరలు తగ్గితే, మన దగ్గర మోదీ వేసిన సుంకాలతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినయ్. రేవంత్ కూడా బడే భాయ్ తీరుగనే హామీలు ఎగ్గొడుతున్నడు‌‌‌‌” అని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కేసీఆర్ శాసించాలంటే.. ఈ ఎన్నికల్లో 12 సీట్లలో తమను గెలిపించాలని అన్నారు.  

మల్లారెడ్డి పిచ్చోడేం కాదు.. తెలివైనోడు

మల్కాజ్‌‌‌‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల గెలుస్తున్నారన్న బీఆర్ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ‘‘మల్లారెడ్డి ఎక్కువ తక్కువ మజాక్ చేస్తడు. పిచ్చోడేం కాదు. తెలివైనోడు. ఈటలను మునగ చెట్టు ఎక్కించి పడేయడానికి ప్రయత్నిస్తున్నడు. ఈటలను రెండుసార్లు ఓడించినం. మళ్లీ ఓడిస్తం. కేకే, కడియం ఇక్కడ కేసీఆర్ పక్కనే కూర్చుంటుండే.. రంజిత్‌‌‌‌రెడ్డి నిత్యం నాతోనే తిరుగుతుండే. వాళ్ల పరిస్థితి ఏందో ఎన్నికల తర్వాత తెలుస్తది” అని ఆయన అన్నారు. ‘‘కడియం చేసిన ద్రోహం ఒక మానని గాయం. ఆయన కాంగ్రెస్​లో చేరికతో వరంగల్‌‌‌‌లో  ఆ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. కడియం ఉద్యమ ద్రోహి‌‌‌‌. అతనికి కేసీఆర్ ఎన్నో పదవులు, అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు బీఆర్​ఎస్​కు ఆయన చేసిన ద్రోహాన్ని జీర్ణించుకోలేకపోతున్నం” అని కేటీఆర్ అన్నారు. 

ఇక్కడ గెలిస్తే మహారాష్ట్రలో విజృంభిస్తుంటిమి

లోక్‌‌‌‌సభ ఎన్నికల తర్వాత రాజకీయంగా రాష్ట్రంలో చాలా మార్పులు జరుగుతాయని, ఆ మార్పులో తమ ది గణనీయమైన పాత్ర ఉంటుందని కేటీఆర్ అన్నారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు 12 ఎంపీ సీట్లు వస్తే రాజకీయాలను కేసీఆర్ శాసిస్తారని చెప్పారు. రాష్ట్రంలో మరోసారి గెలిస్తే మహారాష్ట్రలో ఇప్పటికే తాము విజృంభించేవాళ్లమని చెప్పారు. ఏపీలో ప్రాంతీయ పార్టీ గెలవాలని కోరుకుంటున్నామని, జరగబోయేది కూడా అదే అని కేటీఆర్​ అన్నారు. ‘‘మాకున్న సమాచారం ప్రకారం జగన్‌‌‌‌ గెలవబోతున్నడు” అని తెలిపారు. 

సాదాసీదాగా  బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఆవిర్భావ వేడుకలు ఈసారి సాదాసీదాగా జరిగాయి. శనివారం తెలంగాణ భవన్​కు కొంత మంది నేతలే రావడంతో వెలవెలబోయింది. వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌, నలుగురైదుగురు నాయకులు మాత్రమే పాల్గొన్నారు. కేటీఆర్‌‌‌‌ పార్టీ‌‌‌‌ జెండాను ఆవిష్కరించి, క్యాడర్​కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2001లో శూన్యం లాంటి వాతావరణం ఉన్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ఎస్ ను కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు.

సమైక్యవాద శక్తుల కుట్రలను ఛేదించి, పార్టీ ద్వారా తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో వినిపించామన్నారు. తెలంగాణ ప్రజల సహకారంతోనే రాష్ట్రం సాకారం అయిందన్నారు. ప్రజలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. దురదృష్టవశాత్తు అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదన్నారు. అయితే, విజయాలకు పొంగిపోమని, అపజయాలకు కుంగిపోమన్నారు. ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటామని ప్రకటించారు. 

బీజేపీకి 230 సీట్లే

ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 230 సీట్ల కంటే ఎక్కువ రావ ని కేటీఆర్ ​అన్నారు. ‘‘400 సీట్లు వస్తాయని మోదీ చెప్తున్నవన్నీ  ఉత్తరకుమార ప్రగల్భాలే. ప్రాంతీయ పార్టీలే మోదీకి, బీజేపీకి చెక్ పెడుతున్నయ్​. మోదీని ఎదుర్కొనుడు కాంగ్రెస్‌‌‌‌తోని అయితలేదు. ఈ ఎన్నికల్లో మేం 12 సీట్ల వరకూ గెలుస్తం” అని ఆయన అన్నారు. ఖమ్మంలో కచ్చితంగా గెలుస్తామని చెప్పారు. ప్రజల మూడ్‌‌‌‌ను గ్రహించి రేవంత్‌‌‌‌రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్‌‌‌‌ను గెలిపించుకునేందుకు గింగిరాలు కొడుతున్నారని ఆయన విమర్శించారు.  సీఎం, డిప్యూటీ సీఎం ఇంచార్జులుగా ఉన్న పార్లమెంట్‌‌‌‌ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఓడిపోతుందని, అందుకే వాళ్లిద్దరూ ఇన్​చార్జ్​ బాధ్యతల నుంచి తప్పుకున్నారని వ్యాఖ్యానించారు. 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను కాళేశ్వరంపై ఎంక్వైరీకి పిలిస్తే తప్పేం లేదు

కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విచారణ గురించి, కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ఎంక్వైరీకి పిలుస్తారన్న వార్తల గురించి కేటీఆర్ స్పందించారు. ‘‘పదేండ్లలో మేం ఏమీ చేయలేదనే మీకు(కాంగ్రెస్​కు) అధికారం ఇచ్చారని అంటున్నరు కదా. మీరు ఏం పీకుతరో పీకండి. కాళేశ్వ రం‌‌‌‌పై ఎంక్వైరీకి కేసీఆర్‌‌‌‌ను పిలిస్తే తప్పులేదు. దాని గురించి పిలిచినప్పుడు చూద్దాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.