తెలంగాణలో జిల్లాల ఏర్పాటుకు పదేండ్లు పూర్తి..పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం

తెలంగాణలో జిల్లాల ఏర్పాటుకు పదేండ్లు పూర్తి..పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నేతలకు బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌ పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో అధికార వికేంద్రీకరణ ఒక ప్రధాన ఆశయమని, ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకురావాలన్న లక్ష్యంతో గత బీఆర్ఎస్ సర్కార్ పరిపాలనా సంస్కరణలు చేపట్టిందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశామని తెలిపారు. 

ప్రతి జిల్లా కేంద్రంలో దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు.. జిల్లాల కోసం ఉద్యమించిన జేఏసీలు, ఉద్యమకారులను సన్మానించాలని సూచించారు. జిల్లాల ఏర్పాటు కేవలం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ మాత్రమే కాదని, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతులను ప్రజలకు చేరువ చేసే ప్రక్రియలో భాగమన్నారు.