న్యూఢిల్లీ: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. శుక్రవారం (అక్టోబర్ 9) ఉదయం 8 గంటల నుంచి అధికారులు కౌంటింగ్ స్టార్ట్ చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంలను ఓపెన్ చేయనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీగా భద్రతను మోహరించారు. మూడు అంచెల భద్రతా ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు సాగుతోంది. సర్ ప్రక్రియ, ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతోన్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని ఒక లోక్‌సభ స్థానానికి అక్టోబర్ 6న ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో సభ్యులు రాజీనామాలు చేయడంతో ఈ స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అస్సాంలోని నగావ్ పార్లమెంట్, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజీగ్రామ్, పుదుచ్చేరిలోని తట్టంచావడి, తమిళనాడులోని మదురాంతకం, ధరాపురం అసెంబ్లీ స్థానాల్లో బై పోల్స్ జరిగాయి.
ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఉప ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బెంగాల్లో బీజేపీ, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత జరుగుతోన్న తొలి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఎన్నికల ఫలితాలను సువేందు అధికారి, విజయ్ ప్రభుత్వాల ప్రజాదరణకు ఒక పరీక్షగా పరిగణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
తమిళనాడులో సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్‌తో పాటు విరాలిమలై, పెరందురై, అంబసముద్రం, కరూర్ నియోజకవర్గాలకు కూడా బై ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. ఈ స్థానాల్లో కూడా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే, ఈ స్థానాలకు సంబంధించి గత ఎన్నికల ఫలితాలపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ప్రస్తుతం ఈ పిటిషన్లపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్లపై విచారణ పూర్తై తీర్పు వెలువరించే వరకు ఉప ఎన్నికలు నిర్వహించబోమని గతంలో కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించడం లేదు.
