అణగారిన వర్గాల ఓట్లే మోడీ, షా టార్గెట్.. ఏకంగా 13 కోట్ల ఓట్లు ఎట్లా డిలీట్ చేస్తరు: సీఎం రేవంత్

అణగారిన వర్గాల ఓట్లే మోడీ, షా టార్గెట్.. ఏకంగా 13 కోట్ల ఓట్లు ఎట్లా డిలీట్ చేస్తరు: సీఎం రేవంత్
  • ఓటు హక్కు నుంచి వారిని దూరం చేస్తుండ్రు
  • ఏకంగా 13 కోట్ల ఓట్లు ఎట్లా డిలీట్ చేస్తారు
  • మేం సామాన్యుల పక్షాన ఉద్యమిస్తున్నం 
  • ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి 
  • రాష్ట్ర ఎంపీలతో కలిసి కాలినడకన
  • బాపూ ఘాట్​కు ముఖ్యమంత్రి 

ఢిల్లీ, వెలుగు: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అణగారిన వర్గాల నుంచి గుంజుకునేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ ఆరోపించారు. దళిత, గిరిజన, ఆదివాసీ, బహుజన వర్గాలకు ఓటు హక్కును దూరం చేస్తున్నారని మండిపడ్డారు. 

దేశ జనాభా 140 కోట్లకు చేరిన నేపథ్యంలో ఓటర్ల సంఖ్య మరింత పెరగాల్సింది పోయి.. ఏకంగా 13 కోట్ల ఓట్లు ఎట్లా డిలీట్ అయ్యాయని ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలో ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ ఉద్యమంలో భాగంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇండియా కూటమి నేతలు మహాత్మా గాంధీ సమాధి రాజ్‌‌‌‌‌‌‌‌ఘాట్ వద్ద నిరసన చేపట్టారు. 

ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్​రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కలిసి రాజ్‌‌‌‌ఘాట్ వద్దకు కాలినడకన వెళ్లారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని ఎన్డీఏ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌ను ప్రధాని మోదీ వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే మోదీ గద్దె దిగాలని, లేకుంటే ప్రజలే దింపుతారని అన్నారు. ఈడీ, ఐటీ శాఖ, సీబీఐ దాడులు ఇకపై బీజేపీ ప్రభుత్వాన్ని ఏమాత్రం రక్షించలేవన్నారు. 

సామాన్యుల హక్కుల కోసం ఉద్యమం

‘ఓటు బచావో.. దేశ్ బచావో’ ఉద్యమం కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి కోసం చేస్తున్న పోరాటం కాదని, దేశంలోని సామాన్యుల హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యమమని రేవంత్ అన్నారు. 2014 ఎన్నికల నాటికి దేశంలో 81 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 2019 నాటికి ఆ సంఖ్య 91 కోట్లకు చేరిందని గుర్తుచేశారు. 

2024 నాటికి 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. దేశ జనాభా 140 కోట్లకు చేరిన నేపథ్యంలో ఓటర్ల సంఖ్య మరింత పెరగాల్సింది పోయి ఏకంగా 13 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపించారు. అవి ఎలా తగ్గిపోయాయో ప్రధాని మోదీ దేశ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

దళితులు, గిరిజనుల ఓట్లే టార్గెట్

సంపన్నులు, పేదలు అనే తేడా లేకుండా డాక్టర్ అంబేడ్కర్ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించారని చెప్పారు. ఇప్పటివరకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా పేదల ఓట్లకు ముప్పు కలగలేదన్నారు. ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అణగారిన వర్గాల నుంచి గుంజుకునేందుకు ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

ఎన్నికల సంఘం తప్పులను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై పోలీసులతో దాడులు చేయించడం, ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నేతలను ఈసీ కలవకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని మండిపడ్డారు. ఇప్పుడు ప్రజలను ఓటు ఉన్నవాళ్లు, ఓటు లేనివాళ్లుగా రెండు వర్గాలుగా విభజిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి అనుకూలంగా ఉన్నవాళ్లు ఒకవైపు, ఆ పార్టీని వ్యతిరేకించే పేదలు మరోవైపు అన్నట్లుగా మోదీ, జ్ఞానేశ్ కుమార్ పరిస్థితులను మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.