- .36 ఏండ్లుగా వెయ్యి స్తంభాల గుడిలో బతుకమ్మ ఆటపాటలు
- రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా ఏర్పాట్లు
- పర్యవేక్షించిన వరంగల్ పశ్చిమఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి
వరంగల్, వెలుగు: పూల పండుగ బతుకమ్మ సంబురాలకు ఓరుగల్లు వేదికైంది. రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగకు కేరాఫ్ గా భావించే హనుమకొండలోని వెయ్యి స్తంభాల గుడిలో రేపు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర సర్కారు తరపున గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్‍పాయ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
1990 నుంచి బతుకమ్మ సంబురాలు..
1990 నుంచే వెయ్యి స్తంభాల గుడిలో నిర్వహించే బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో రావడం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోతుంది. ఇదిలాఉంటే 2006లో అప్పటి సీఎం వైఎస్సార్ వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు. ఆలయంలో బతుకమ్మ వేడుకలకు సౌలతులు కల్పించాలని భక్తులు విజ్ఞప్తి చేయగా, సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి జీడబ్ల్యూఎంసీ, ఇతర శాఖల సమన్వయంతో ఇక్కడ బతుకమ్మ ఉత్సవాల నిర్వహణ ప్రారంభమైంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నుంచే వేడుకలు ప్రారంభించే ఆనవాయితీ కొనసాగిస్తోంది. ఇదిలాఉంటే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని
కోరుతున్నారు.
