- ముగ్గురు మహిళా నేతలతో నిజనిర్ధారణకు ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: బీజేపీ యువమోర్చా నేత పీఎం సాయిప్రసాద్, ఎస్సీ మోర్చా నాయకురాలు పద్మిని మధ్య జరిగిన వివాదంపై విచారణకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ముగ్గురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని నియమించింది. ఈ నెల 6న వీరిద్దరి మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ నిజనిర్ధారణ కమిటీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు కె. గీతామూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బండారు శైలజ ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు తక్షణమే రంగంలోకి దిగి, సాయిప్రసాద్, పద్మిని మధ్య జరిగిన వివాదంపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలతో కూడిన సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా రాష్ట్ర నాయకత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కమిటీ రిపోర్టు ఆధారంగా తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశముంది.
