పోక్సో కేసు కంటెంట్‌‌ ప్రసారం చేయొద్దు..మీడియాకు హైకోర్టు ఆదేశం..బండి బగీరథ్‌‌కు ఊరట

పోక్సో కేసు కంటెంట్‌‌ ప్రసారం చేయొద్దు..మీడియాకు హైకోర్టు ఆదేశం..బండి బగీరథ్‌‌కు ఊరట

హైదరాబాద్‌‌, వెలుగు: పోక్సో కేసులో బండి సాయి బగీరథ్‌‌కు హైకోర్టులో ఊరట లభించింది. బగీరథ్‌‌ పోక్సో కేసుకు సంబంధించిన కంటెంట్‌‌ను సోషల్‌‌ మీడియా ప్లాట్‌‌ఫాంలు, టీవీ ఛానళ్లు ప్రసారం చేయకూడదని, వార్తా పత్రికలు కూడా రాయకూడదని కోర్టు స్పష్టం చేసింది. తనపై నమోదైన పోక్సో కేసు వివరాలను సోషల్ మీడియా, టీవీ ఛానళ్లు నిరంతరం ప్రసారం చేస్తున్నాయని, వాటిని నిలువరించాలని కోరుతూ బండి బగీరథ్‌‌ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై జస్టిస్‌‌ ఈవీ వేణుగోపాల్‌‌ గురువారం విచారణ చేపట్టారు. 

పిటిషనర్‌‌ తరఫున సీనియర్‌‌ న్యాయవాది అవినాష్‌‌ దేశాయ్‌‌ వాదిస్తూ..పోక్సో కేసులో బగీరథ్‌‌కు ఇప్పటికే బెయిల్‌‌ మంజూరైందని తెలిపారు. అయినా కేసు అంశాలను పలు టీవీ ఛానళ్లు, సోషల్‌‌ మీడియా వేదికలు పదేపదే ప్రసారం చేస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల ఆయన ప్రతిష్ఠకు నష్టం కలుగుతోందని వాదించారు. దీన్ని అడ్డుకోవాలని కోర్టును కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. బగీరథ్‌‌ పోక్సో కేసుకు సంబంధించిన కంటెంట్‌‌ను ప్రసారం చేయకూడదని సోషల్‌‌ మీడియా ప్లాట్‌‌ఫాంలు, టీవీ ఛానళ్లను ఆదేశించింది. ఈ వ్యవహారంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌‌ అండ్‌‌ ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ శాఖ, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీతో పాటు గూగుల్‌‌, మెటా, ఎక్స్‌‌, ఫేస్‌‌బుక్‌‌, ఇన్‌‌స్టాగ్రామ్‌‌, యూట్యూబ్‌‌ తదితర సంస్థలు, పలు టీవీ ఛానళ్లు నాలుగు వారాల్లో కౌంటర్‌‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.