యువత క్రీడల్లో రాణించాలి :  ఎంపీ డీకే అరుణ, విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

యువత క్రీడల్లో రాణించాలి :  ఎంపీ డీకే అరుణ, విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి 
  • జేపీఎన్సీఈలో ప్రారంభమైన జాతీయ స్థాయి బాక్సింగ్​ పోటీలు 

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : యువత క్రీడల్లో రాణించి జాతీయ స్థాయికి ఎదగాలని ఎంపీ డీకే అరుణ, విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం మహబూబ్​నగర్​ నగరంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర ప్రభుత్వ విప్, మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అథితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ పాలమూరు గడ్డపై ఇలాంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పోటీలు జరగడం శుభపరిణామమన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.

విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాక్సింగ్ ఎంతో కఠినమైన క్రీడ అని, శారీరక దారుఢ్యంతో పాటు మానసిక స్థైర్యం, క్రమశిక్షణ అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగానికి పెద్దపీట వేస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. దేశంలోని 24 రాష్ట్రాల నుంచి విచ్చేసిన 250 మంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటి, అంతర్జాతీయ వేదికలపై దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. కళాశాల చైర్మన్  రవికుమార్ మాట్లాడుతూ జాతీయ స్థాయి సీనియర్ మెన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ తమ కళాశాలలో నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అంతకుముందు జాతీయ పతాకాన్ని, బాక్సింగ్ ఫెడరేషన్ జెండాను ఆవిష్కరించి క్రీడాకారుల నుంచి ఎంపీ, విప్​గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాకారులతో కలిసి బాక్సింగ్ రింగ్ లో పంచ్ లు వేసి పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి రాకేశ్ భరద్వాజ్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రఘువీర్ సింగ్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్, మహబూబ్‌‌‌‌నగర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజు గౌడ్, కళాశాల అధ్యాపకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.