దసరా పండక్కి ఊళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఈ రూట్లలో APSRTC స్పెషల్ బస్సులు..

దసరా పండక్కి ఊళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఈ రూట్లలో APSRTC స్పెషల్ బస్సులు..

దసరా పండగ వచ్చేసింది.. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు కూడా మొదలవనున్నాయి. ఊళ్ళకి దూరంగా హాస్టళ్లలో ఉంటూ చదువుకునే పిల్లలు, నగరాలు, పట్టణాల్లో స్థిరపడ్డ కుటుంబాలు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పండక్కి ఊళ్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్ చెప్పింది APSRTC. దసరా సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా 5వేల 261 ప్రత్యేక బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేసింది ఆర్టీసీ.

హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైతో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు నడపనున్నట్లు తెలిపింది ఆర్టీసీ. ఈ ఏడాది దసరా ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి... మూల నక్షత్రం అక్టోబర్ 16న, దుర్గాష్టమి అక్టోబర్ 18న, మహర్నవమి అక్టోబర్ 19న, విజయదశమి అక్టోబర్ 20న జరగనున్నాయి.

ఈ క్రమంలో ప్రయాణికుల స్వస్థలాలకు రాకపోకలు సులభతరం చేసేందుకు అక్టోబర్ 16 నుంచి 19 వరకు ప్రీ దసరా, అక్టోబర్ 20 నుంచి 25 వరకు పోస్ట్ దసరా స్పెషల్ బస్సులు నడపనుంది ఆర్టీసీ.

ప్రధాన నగరాలకు స్పెషల్ బస్సులు ఇలా:

  • హైదరాబాద్: 1,186
  • విజయవాడ: 1,053
  • ఇతర గమ్యస్థానాలు: 1,360
  • బెంగళూరు: 475
  • విశాఖపట్నం: 440
  • రాజమండ్రి: 347
  • తిరుపతి: 247
  • చెన్నై: 153

జోన్ల వారీగా.. జోన్-1లో 1,107, జోన్-2లో 2,218, జోన్-3లో 818, జోన్-4లో 1,118 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. జిల్లాల వారీగా.. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాకు 804, విశాఖపట్నానికి 416, ఏలూరుకు 340, కడపకు 318, శ్రీకాకుళానికి 279, తూర్పుగోదావరికి 260, ప్రకాశం జిల్లాకు 245, కాకినాడకు 224 ప్రత్యేక బస్సులు కేటాయించినట్లు తెలిపింది ఆర్టీసీ.

ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైన చోట అదనపు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేందుకు కూడా ఏర్పాట్లు చేశామని... దసరా అనంతరం స్వస్థలాల నుంచి తిరుగు ప్రయాణాల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 20 నుంచి 25 వరకు కూడా ప్రత్యేక సర్వీసులు కొనసాగనున్నాయని తెలిపారు అధికారులు. ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందించడమే APSRTC ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.