తనదైన మాటతీరు, వినూత్నమైన మ్యానరిజంతో లక్షలాది మందిని నవ్వించిన అగ్గిపెట్టె మచ్చ.. ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన అగ్గిపెట్టె మచ్చ అలియాస్ కిరణ్ కుమార్ అకాల మరణంతో తిరుపతిలో విషాద ఛాయలు అలముకున్నాయి. అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ( అక్టోబర్ 7 ) కన్నుమూసిన కిరణ్ కుమార్ అంత్యక్రియలకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
తిరుపతి రూరల్ వైఎస్సార్ కాలనీలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానుల రోదనల మధ్య విషాద వాతావరణం నెలకొంది. నిన్నటి వరకు తన డైలాగులతో అందరినీ నవ్వించిన అగ్గిపెట్టె మచ్చ.. ఇవాళ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తూ శాశ్వతంగా వీడ్కోలు పలికాడు.
సాధారణ యువకుడిగా జీవితాన్ని ప్రారంభించిన కిరణ్ కుమార్.. అగ్గిపెట్టె మచ్చగా ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారాడు. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, టీవీ కార్యక్రమాలతో మరింత ప్రజాదరణ పొందాడు. అయితే అనూహ్యంగా తీవ్ర అనారోగ్యానికి గురైన కిరణ్ కుమార్‌ను అక్టోబర్ ఐదో తేదీన కుటుంబ సభ్యులు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. చివరకు ఆయన కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.కిరణ్ కుమార్ మరణవార్త తెలియగానే అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
తిరుపతి రూరల్ వైఎస్సార్ కాలనీలో ఆయన భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ అభిమాన అగ్గిపెట్టె మచ్చ ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. సోషల్ మీడియాలో ఆయనతో కలిసి వీడియోలు చేసిన యూట్యూబర్లు, కళాకారులు, స్నేహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు నవ్వులు పూయించిన ఆయన వీడియోలే.. ఇప్పుడు అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. చిన్న వయసులోనే కిరణ్ కుమార్ మృతి చెందడం కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులను తీవ్రంగా కలచివేసింది. అగ్గిపెట్టె మచ్చగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కిరణ్ కుమార్‌కు అభిమానులు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
