ఏటా 700 కోట్ల మగ కోడిపిల్లలను చంపేస్తున్నారు !

ఏటా 700 కోట్ల మగ కోడిపిల్లలను చంపేస్తున్నారు !
  • మెర్సీ ఫర్ యానిమల్స్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో నిరసన ర్యాలీ

ట్యాంక్ బండ్, వెలుగు: గుడ్ల పరిశ్రమలో కోడిపిల్లలపై జరుగుతున్న క్రూరత్వాన్ని నిరసిస్తూ మెర్సీ ఫర్ యానిమల్స్ సంస్థ ప్రతినిధులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ గుడ్డు దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో భారీ మిక్సీలో చిక్కుకున్న కోడిపిల్లను ప్రతిబంబించే భారీ ప్లకార్డు ప్రదర్శించారు.

సంస్థ ప్రతినిధులు నికూంజ్ శర్మ, కుషాల్ మాట్లాడుతూ..ఆధునిక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ గుడ్డు పరిశ్రమలో క్రూరమైన పద్ధతులను కొనసాగించడం అమానవీయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 700 కోట్ల మగ కోడిపిల్లలను చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

లేయర్‌ జాతికి చెందిన మగ కోడిపిల్లలు గుడ్లు పెట్టలేవని, బ్రాయిలర్‌ కోళ్ల మాదిరిగా మాంసం ఉత్పత్తికి కూడా ఉపయోగపడవన్నారు. దీంతో వాటిని ఆర్థిక భారంగా పరిగణించి, గుడ్డు నుంచి బయటకు వచ్చిన కొద్ది గంటల్లోనే చంపుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ సహా దేశంలోని పలు హ్యాచరీల్లో నిర్వహించిన పరిశోధనల్లో కోడిపిల్లలను గ్రైండర్లలో వేసి రుబ్బడం, కాళ్లతో తొక్కి చంపడం, సజీవంగా కాల్చడం వంటి ఘటనలను గుర్తించామని తెలిపారు. ఈ క్రూరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు గుడ్ల వినియోగంపై పునరాలోచించి, దూరంగా ఉండాలన్నారు.