మెట్ల బావుల నగరం.. హైదరాబాద్లో 150 మెట్ల బావులకు పూర్వ వైభవం కోసం హైడ్రా ప్లాన్

మెట్ల బావుల నగరం.. హైదరాబాద్లో 150 మెట్ల బావులకు పూర్వ వైభవం కోసం హైడ్రా ప్లాన్
  • ఇప్పటికే 150 గుర్తింపు.. మరో 50 ఉంటాయని అంచనా
  • బన్సీలాల్ పేట్, సెవెన్ టూంబ్స్లో బావుల మాదిరిగా అభివృద్ధి

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ చారిత్రక నగరం..ఇది విభిన్న సంస్కృతుల నిలయం. ఇక్కడి కట్టడాల్లో ఒకే శైలి మాత్రమే కాకుండా ఇరానీ (పర్షియన్), ఇండో-సార్సెనిక్ (ఇండో-ఇస్లామిక్), కుతుబ్ షాహీ, ఆసిఫ్ జాహీ (మొఘల్), బ్రిటీష్ (యూరోపియన్), అఫ్గాన్ శైలులు కనిపిస్తాయి. ఈ శైలిలో గోల్కొండ, చార్మినార్, మక్కా మసీదు, సాలార్‌జంగ్‌మ్యూజియం, ఫలక్‌నుమా ప్యాలెస్‌, కుతుబ్‌షాహీ టూంబ్స్‌వంటి పలు చారిత్రక కట్టడాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

అయితే, వీటన్నింటిని సమ్మేళన శైలికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నవి సిటీలోని పురాతన మెట్ల బావులు..తెలంగాణలో మెట్ల బావుల సంస్కృతికి పునాది వేసిన కాకతీయులతో పాటు  కుతుబ్ షాహీలు, నిజాం రాజుల కాలంలో కొన్ని వందల బావులను నిర్మించారు. అయితే, రాను రాను అవన్నీ కనుమరుగైపోయాయి.

ఇప్పటివరకు నగరంలో 150 మెట్ల బావులను గుర్తించగా,  వెలుగులోకి రాకుండా ఉన్నవి మరో 50 వరకు ఉంటాయని అంచనా. ఈ క్రమంలో గుర్తింపునకు నోచుకోని పురాతన బావులను గుర్తించి వాటి చారిత్రక ప్రాధాన్యతను వెలుగులోకి తేవాలని హైడ్రా నిర్ణయించింది.

అకర్మ ఫౌండేషన్​తో కలిసి..
సిటీలోని మెట్ల బావులను గుర్తించి, వాటి వివరాలను నమోదు చేయడంతో పాటు భవిష్యత్‌లో పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని హైడ్రా భావిస్తున్నది. అకర్మ ఫౌండేషన్ తో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నది. ఇప్పటివరకు నగరంలో పలు సంస్థలు సెవెన్ టూంబ్స్, బాపూఘాట్, గచ్చిబౌలి, రాష్ట్రపతి నిలయం, బన్సీలాల్ పేట్ సహా మొత్తం 10 మెట్ల బావులను డెవలప్​చేశాయి. 

ఇదే విధంగా ఎన్​జీవోల సాయంతో సిటీలోని మొత్తం బావులను గుర్తించి  డెవలప్ చేసేందుకు హైడ్రా ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు బావులపై ఉన్న ఆక్రమణలను ముట్టుకోకుండా..ఇప్పుడు ఆక్రమణలకు ప్రయత్నిస్తుంటే తొలగించి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నది.

బన్సీలాల్‌పేట్‌ , సెవెన్ టూంబ్స్లో పునర్ ​వైభవం
గోల్కొండ సమీపంలోని కుతుబ్‌షాహీ టూం బ్స్​  ప్రాంగణంలో, అలాగే, సికింద్రాబాద్‌ బన్సీలాల్‌పేట్‌లోని పురాతన మెట్ల బావి పునరుద్ధరణ తర్వాత అవి పర్యాటక స్థలాలుగా గుర్తింపు పొందాయి. 2021లో బన్సీలాల్‌పేట్‌లోని మెట్లబావి రీ స్టోరేషన్ ప్రారంభమైంది. దీంట్లో నుంచి దాదాపు 500 టన్నుల వ్యర్థాలను ను వెలికితీశారు.