వెలుగు స్పెషల్ : బహుజన రాజ్యాధికార స్వప్నానికి బాటలు వేసిన యోధుడు

వెలుగు స్పెషల్ : బహుజన రాజ్యాధికార స్వప్నానికి  బాటలు వేసిన యోధుడు

భారత ఉపఖండంలో బహుజన రాజ్యాధికార స్వప్నానికి బాటలు వేసిన యోధుడు మాన్యవర్ కాన్షీరాం. ఓట్లు మావి–సీట్లు మీవా ఇకపై చెల్లదు.. ఇకపై చెల్లదు అంటూ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. ఎవరెంతో వారికంత వాటా అనే నినాదంతో జనాభా దామాషా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యాన్ని డిమాండ్ చేసిన మొట్టమొదటి బహుజన నాయకుడు కాన్షీరాం.  

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక, 1975 ఎమర్జెన్సీ తరువాత కూడా అటు దేశంలో, ఇటు రాష్ట్రాల్లోనూ  రైటిస్ట్,  లెఫ్టిస్ట్, లిబరల్ పార్టీలే అధికారంలో ఉండేవి. ఆ పార్టీలలో ఒకరేమో రాజ్యాంగం బూటకమని, మరొకరేమో రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రపన్నారు. ఆ పార్టీలకు అభిముఖంగా  కాన్షీరాం కానిస్టిట్యూషనలిజంతో బహుజనులను ఏకంచేసి రాజ్యాధికారం వైపు నడిపించారు. అందుకే మన దేశ రాజకీయ చరిత్రను కాన్షీరాంకు ముందు, ఆ తరువాత అని చదువుకోవాలి. 

దేశ రాజకీయల్లో కాన్షీరాం ప్రకంపనలు

‘రాజ్యాధికారమే మాస్టర్ కీ’ అని బోధించిన అంబేద్కర్ ఆలోచనతో దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన శక్తి కాన్షీరాం. ఒక ఓటు- ఒక నోటు నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లి వారిచ్చే డబ్బుతోనే ప్రచారం చేశాడు.  ‘85 శాతం జనాభా  నీతో ఉన్నప్పుడు,  మిగిలిన15 శాతం మీద ఎందుకు ఆధారపడాలి? అని కాన్షీరాం ప్రశ్నిస్తూ, బహుజనుల సంఖ్యాబలాన్ని సామాజిక–రాజకీయ శక్తిగా మలిచాడు. 

 పార్లమెంటు, అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్వాభిమానాన్నీ నేర్పిన యోధుడు.  కాన్షీరాం ఓబీసీ హక్కుల కోసం బలంగా ఉద్యమించారు. 1984 ఆగస్టులో ‘మండల్‌‌ కమిషన్ నివేదిక అమలు చేయండి  లేదా  కుర్చీ ఖాళీ చేయండి’ అనే నినాదంతో ఢిల్లీలోని బోట్స్ క్లబ్ వద్ద జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. 

కుల భారతంలో కులాన్నీ రాజకీయ అస్త్రంగా వాడి కులాన్ని కూల్చే ప్రయత్నం చేసిన రాజనీతిజ్ఞుడు. మినీ ఇండియాలాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక దళిత మహిళ మాయావతిని నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాడు. ఇది భారత రాజకీయాల్లో అరుదైన ఘట్టం.

నయా కాన్షీరాం ఉద్యమం కొనసాగింపు

వేల సంవత్సరాలుగా కనీస మానవ హక్కులకు నోచుకోని దళిత–బహుజనుల విముక్తి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తన జీవితాన్నే అంకితం చేశారు.  ఓటు అనే ఆయుధమిచ్చాడు. అయినా ఇంకా దేశ రాజకీయాలు అగ్రకుల కబంధహస్తాల కింద నలిగిపోతున్నాయి. 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 90శాతం బీసీ,  ఎస్సీ, ఎస్టీలకు  భూమి, సంపద, అధికారంలో సముచిత వాటా దక్కలేదు.  

ఆగిపోయిన కాన్షీరాం రాజ్యాధికార మిషన్ ఇప్పుడు  ‘ఎవరి కులం ఎంతో వారికి అంత వాటా’ నినాదంతో డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో ధర్మ సమాజ్ పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ స్వశక్తితో,  స్వధర్మంతో ముందుకు సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌‌లో ఆజాద్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) బహుజనుల రాజ్యాధికారం కోసం ముందుకు వెళ్తోంది. 

ఈ విభిన్న వేదికలు అగ్రవర్ణ పార్టీలకు అభిముఖంగా కాన్షీరాం రాజ్యాధికార 'కల'ను నర్జీవింపచేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో కాన్షీరాం  రాజకీయ ఉద్యమ శంఖారావం మరోసారి  ప్రతిధ్వనించాలి.  బహుజనుల ఉద్ధరణకు జీవితాంతం కృషి చేసిన కాన్షీరాం 2006 అక్టోబర్‌‌ 9న కన్నుమూశారు. ఇప్పుడు ఆయన కలను సాకారం చేయడమే మన కర్తవ్యం. 


 

- సంపతి రమేష్,సోషల్ ఎనలిస్ట్‌‌ -

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.