వెలుగు స్పెషల్ : తెలంగాణకు ఏటా కావాల్సింది నీటి వివరాల బడ్జెట్

వెలుగు స్పెషల్ : తెలంగాణకు ఏటా కావాల్సింది  నీటి వివరాల బడ్జెట్

గత 12 ఏండ్లుగా వర్షాలు పడుతున్నా...ఈ ఒక్క వర్షాకాలం వానలు  లేకపోవడంతోనే మనకు నీటి సమస్య ఏర్పడడం ఆశ్చర్యమే.  దీనినిబట్టి సమస్యకు మూలం  ఎల్‌‌నినో  లేదా వాతావరణ మార్పులు ప్రాథమిక కారణాలు కానే కాదు. 

ఆధునిక ఆర్థిక వ్యవస్థలో,  నీటి ఉపయోగంతోపాటు దుర్వినియోగం కూడా పెరిగింది. వాడుతున్న నీటిని కలుషిత వ్యర్ధ జలాలుగా పారవేసే లీనియర్ వినియోగ వ్యవస్థ గురించి మనం చర్చించుకోవాలి. నీటి కొరత దిశగా మన పయనం ఏనాడో మొదలు అయ్యింది.  ఈ సంవత్సరం ఎల్‌‌నినోతో  కూడిన వాతావరణ మార్పులు, పుడమి  ఉష్ణోగ్రతలు ఆ పయనంలో ఒక మైలురాయి మాత్రమే.

కృత్రిమ కొరత

రెండు ప్రక్రియలు సమాంతరంగా సాగుతున్నాయి.  మొదటిది,  వర్షపు నీటిని పట్టిఉంచి,  నిల్వచేసి,  క్రమంగా విడుదల చేసే సహజ నీటి వ్యవస్థ సామర్థ్యం నిరంతరం క్షీణించడం. ఈక్రమంలో నేల పొరలు కరిగిపోవడం, మట్టి క్రమంగా కనుమరుగు అవడం వల్ల.. పడిన వర్షాన్ని ఆపుకుని భూమిలోకి ఇంకే సహజ పొరలు నశించాయి. 

వర్షం నీళ్లుపడిన వెంటనే నదిలోకి పారేస్థాయికి ఆయా ప్రాంతాల సహజ వ్యవస్థ పరిస్థితి దిగజారింది. ఈ రాష్ట్రానికి అసలైన వర్షపు నీటి సేకరణ వ్యవస్థలో అడవులు, గడ్డి మైదానాలు, చెరువులు, కాలువలు, చిత్తడి నేలలు, చిన్న వాగులు ఉండేవి. ఇవి వర్షపు నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేసి, భూమిలోకి ఇంకేలా చేసి, భూగర్భ జలాలను నింపుతాయి.  

క్వారీలు, రియల్ ఎస్టేట్, రహదారి, పారిశ్రామిక కారిడార్లు, చెరువులతోపాటు శిఖం భూముల  ఆక్రమణలు, అటవీ భూములు ఇతర  ప్రాజెక్టులకు కేటాయింపు, ఏకపంట తోటలు, అదుపులేని బోరుబావుల తవ్వకాల వల్ల ఈ వ్యవస్థ అనేకచోట్ల పూర్తిగా ధ్వంసం అయ్యింది. పట్టణాలలో పూర్తిగా కనుమరుగైంది. పట్టణ శివారు ప్రాంతాలు, గ్రామాలలో క్రమంగా ధ్వంసమవుతోంది. 

వర్షం పడినా చుక్కనీరు కూడా భూమిలోకి ఇంకని  పరిస్థితి

వర్షం పడినా చుక్కనీరు కూడా భూమిలోకి ఇంకని  పరిస్థితి ఏవిధంగా ఏర్పడింది?.  భారీ ప్రాజెక్టులు రాజకీయ నాయకుల  స్వీయ లబ్ధి పొందడానికే అని ప్రజలు  గుర్తించనంతకాలం ఈ ‘ఆట’ ఆగేటట్టు లేదు.  రెండోది, వర్షాల తీరులో వస్తున్న మార్పు. వర్షాలు ఎక్కువగా స్వల్పకాలంలో తీవ్రంగా కురుస్తున్నాయి, ఆ తర్వాత సుదీర్ఘ పొడి కాలాలు వస్తున్నాయి.  దీంతో  నీటి కొరతలు తలెత్తుతున్నాయి. 

ప్రస్తుత నీటి సంక్షోభం మానవ కార్యకలాపాలకు తోడ్పడిన వాతావరణ ధోరణి కారణం. కేవలం ఎల్‌‌నినో అని భావిస్తే పరిష్కారాలు సాధ్యం కావు. ఈ రెండు ప్రక్రియలు ఒకదానికొకటి ఊతమిస్తాయి. క్షీణించిన పరీవాహక ప్రాంతాలు అస్థిర వర్షపాతాన్ని వరదగానూ, కరువుగానూ మారుస్తాయి. మరోవైపు తాగునీటి జలాశయాలు కాలుష్యంతో నిరుపయోగంగా మారుతున్నాయి. 

ఈ మూడు పరిణామాల వల్ల వినియోగించదగిన నీటివాటా మరింత తగ్గుతోంది. ఇంతటి  ఎల్‌‌నినోను కూడా తట్టుకున్న పచ్చగా కనిపిస్తున్న  తెలంగాణాలోని గొట్టిగారిపల్లి లాంటి గ్రామాలు మనం ఆలోచించవలసిన దిశను గుర్తు చేస్తున్నాయి.  సంస్థాగత వైఫల్యం ఫలితంగా ఏర్పడిన నీటి కొరత 
విధానపరమైన వైఫల్యం వల్ల కొనసాగుతున్నది. 

సహజ వనరుల సంరక్షణ చట్టాలు అమలు కావడం లేదు

మిషన్ భగీరథ, ఇతర భారీ సాగునీటి ప్రాజెక్టులు అపార పెట్టుబడులను మింగేశాయి. కానీ దానికి తగిన ప్రయోజనాలు రాలేదు. చిన్న నీటిపారుదల శాఖను కనుమరుగు చేశారు. పంచాయతీలు తమ ప్రాంత నీటి వనరులపై తమ సార్వభౌమ అధికారాన్ని కోల్పోయాయి. 

సహజ వనరుల సంరక్షణ చట్టాలు అమలు కావడం లేదు. సంస్థాగత వేదికలు మాయమయ్యాయి. నీటి వనరుల సుస్థిర నిర్వహణపై పెట్టుబడి దాదాపు లేదు.  సాగునీటి ప్రాజెక్టులు రాజకీయ నాయకులకు, పార్టీలకు పాడి ఆవులుగా మారాయి.  రాష్ట్రంలో దాదాపు 46,000 ఇటువంటి జలవనరులు ఉండవచ్చని అంచనా. నీటిపారుదల శాఖ పర్యవేక్షిస్తున్న 21,500 చిన్న నీటిపారుదల చెరువుల్లో 17,677 చెరువులు అక్టోబరు 3 నాటికి సగం కంటే తక్కువ నిల్వతో ఉన్నాయని ఒక పత్రిక (అక్టోబరు 4న డెక్కన్ క్రానికల్) నివేదించింది. 

వాటిలో 12,944 చెరువులు ఖాళీగా ఉన్నాయి లేదా నాలుగో వంతు కంటే తక్కువ నీటితో ఉన్నాయి. మొత్తం నిల్వ 253.80 టీఎంసీల సామర్థ్యానికిగాను 94.30 టీఎంసీలకు పడిపోయింది. ఫలితంగా, ఈ చెరువులు నింపే భూగర్భ జలాలు కొన్ని జిల్లాల్లో 6 మీటర్ల వరకు పడిపోతాయని అంచనా.

హైదరాబాద్‌‌లోనూ ఇదే తీరు

హైదరాబాద్‌‌లోనూ ఇదే తీరు కనిపిస్తోంది.  జీహెచ్‌‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ప్రాంతాలతో కూడిన క్యూర్ ప్రాంతంలో సాధారణ వర్షపాతం 619 మి.మీ.లకుగాను 457 మి.మీ. మాత్రమే కురిసింది.  అంటే 26% లోటు. పర్యవేక్షిస్తున్న 46 మండలాల్లో 33 మండలాల్లో లోటు ఉంది. కేవలం 13 మండలాల్లో మాత్రమే సాధారణ స్థాయి నమోదైంది.  

సగటు భూగర్భ జలమట్టం గత ఏడాది 15.5 అడుగుల నుంచి 38 అడుగులకు పడిపోయింది. మరోవైపు  మహారాష్ట్రలో  తీవ్ర పరిస్థితుల కారణంగా నీటి సరఫరాను 10 శాతానికి తగ్గించారు.  అటువంటి  పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటుందో  తెలుసుకోవడానికి తెలంగాణ వేచి చూడకూడదు. నీటిని అధికంగావాడే, కాలుష్యం కలిగించే యూనిట్లు, ముఖ్యంగా బీరు, ఇథనాల్, ఫార్మా, వస్త్ర, డేటా సెంటర్ కార్యకలాపాలు, ఉన్న నీటి వనరుల సామర్థ్యం మీద ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. 

నీటి సంక్షోభం నేపథ్యంలో పరిశ్రమలకు చేసిన అన్ని నీటి కేటాయింపులను రాష్ట్రం సమీక్షించాలి,  వాటిపై  తప్పనిసరి  పరిమితులు విధించాలి.  ఏ కేటాయింపునైనా మీటరింగ్,  బహిరంగ వెల్లడి,  వ్యర్థ జల నిబంధనల పాటింపుతో ముడిపెట్టాలి.

అసెంబ్లీలో నీటి బడ్జెట్ సమర్పించాలి

తెలంగాణకు సమానత్వం, పారదర్శకంగా రూపొందిన జల విధానం కావాలి.  దాని ప్రధాన సాధనం నీటి బడ్జెట్ కావాలి.  వార్షిక ఆర్థిక బడ్జెట్‌‌ను శాసనసభలో ప్రవేశపెట్టినట్లే,  ప్రభుత్వం ప్రతి సంవత్సరం వివరణాత్మక నీటి బడ్జెట్‌‌ను  సమర్పించాలి.  వర్షం, ఉపరితల జలాలు, భూగర్భ జలాల నుంచి ఎంత నీరు అందుబాటులో ఉంది, తాగునీరు, వ్యవసాయం, పరిశ్రమల మధ్య ఎవరికి ఎంత కేటాయించారు. వాస్తవంగా ఎంత వినియోగించారు అనే వివరాలు అందులో ఉండాలి. 

పర్యావరణ వ్యవస్థల పరిరక్షణకు, భవిష్యత్ సంవత్సరాలకు ఎంత మిగిలింది అనేది కూడా అందులో ఉండాలి.  నీటి బడ్జెట్  నీటి వనరుల ఉపయోగాన్ని, నీటి కేటాయింపులను ప్రజలకు కనిపించేలా, చర్చకు వీలయ్యేలా జవాబుదారీగా మారుస్తుంది. ఈ విధానం లేకపోతే అందరికంటే ముందు పేదలే నీరు లేక అల్లాడతారు.  

తెలంగాణ ప్రభుత్వం అధిక నీటి వినియోగం ఏర్పడే కార్యకలాపాలను సమీక్షించి తగ్గించాలి.  నీటి పొదుపు పాటించాలి.  డిసెంబర్లో తలపెట్టిన గ్లోబల్ సమ్మిట్ ఈ సంక్షోభ సమయంలో ఏ మేరకు సహేతుకమో ఆలోచించాలి.  భవన నిర్మాణరంగం మీద కూడా నీటి వినియోగ పరిమితులు పెట్టాలి. భారీగా నీటిని వాడే పరిశ్రమల మీద పరిమితులు అత్యంత అవసరం.


- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్​-

 గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు
.