- బేస్ క్యాంప్ చేరిన కన్నీబాయి, దగ్గరి వరకు వెళ్లిన ఆనంద్‌రావు
నేరడిగొండ (ఇచ్చోడ)/ వెలుగు: మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన తెలంగాణ బిడ్డలు పర్వాతారోహణలో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా ఎంపికైన ఏడుగురిలో చోటు దక్కించుకున్న ఇద్దరు తెలంగాణ యువ సాహసికులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణలో తమ ప్రతిభను చాటారు. కుంమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం భీమన్‌గొంది గ్రామానికి చెందిన మడావి కన్నిబాయి బేస్ క్యాంప్ వరకు విజయవంతంగా చేరగా.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దుబార్‌పేట్‌కు చెందిన ఆనంద్‌రావు లక్ష్యానికి అతి చేరువగా వెళ్లారు.
నేపాల్ వేదికగా జులై 27 నుంచి ఆగస్టు 20 వరకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ కొనసాగింది. తీవ్రమైన చలి, ఎత్తైన శిఖరాలపై ఆక్సిజన్ కొరత వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ కన్నిబాయి పట్టుదలతో బేస్ క్యాంప్‌ను చేరుకున్నారు. ఇదే యాత్రలో పాల్గొన్న ఆనంద్‌రావు కూడా చివరి వరకు పోరాడి అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. కనీస సౌకర్యాలు లేని మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి.. జాతీయ స్థాయిలో పోటీపడి ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్ వరకు వెళ్లిన ఈ యువ సాహసికులను స్థానికులు, వివిధ ప్రజా సంఘాలు, గిరిజన సంఘాల నాయకులు అభినందిస్తున్నారు.
