ములుగు జిల్లాలో వ్యాన్, కారును ఢీకొన్న లారీ.. జవాన్ మృతి

ములుగు జిల్లాలో వ్యాన్, కారును ఢీకొన్న లారీ.. జవాన్ మృతి

వ్యాన్​లోని ముగ్గురు జవాన్లు, కారులోని ఇద్దరికి గాయాలు
ములుగు జిల్లా పస్రా, తాడ్వాయి మధ్యలో ఘటన

తాడ్వాయి (ములుగు), వెలుగు : సీఆర్పీఎఫ్ వ్యాన్, కారును ఇసుక లారీ ఢీకొట్టడంతో ఓ జవాన్​ మృతిచెందాడు. వ్యానులోని మరో ముగ్గురు జవాన్లు, కారులోని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ములుగు జిల్లా పస్రా, తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగింది. తాడ్వాయి ఎస్సై జగదీశ్​తెలిపిన వివరాల ప్రకారం.. ఏటూరునాగారం వైపు నుంచి సీఆర్పీఎఫ్ వాహనంలో నలుగురు జవాన్లు ప్రయాణిస్తున్నారు. వారి వాహనం వెనుకే ఓ కారు వస్తోంది. అదే సమయంలో ఇసుక లారీ పస్రా నుంచి ఏటూరునాగారం వైపు వెళ్తూ పస్రా ఫారెస్ట్ చెక్​పోస్ట్ సమీపంలోని మలుపు వద్ద అదుపుతప్పి ఆ రెండు వాహనాలను వేగంగా ఢీకొట్టింది.

దీంతో సీఆర్పీఎఫ్ వాహనం బోల్తా పడి పక్కనే ఉన్న అడవిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ రమాకాంత్ (35)  అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు రీష్ కుమార్ (51), ప్రేమ్ ప్రకాష్ (27), రామ్ జన్ ప్రసాద్ (50)కు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న తాడ్వాయి ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న పి. రమేశ్, గోవిందరావుపేట ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న సఫియా కూడా తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఇరుక్కుపోయిన వారిని పోలీసులు జేసీబీ సహాయంతో డోర్లను తొలగించి బయటకు తీశారు. గాయపడిన ఐదుగురిని 108 అంబులెన్స్​లో ములుగు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.