- దర్యాప్తు, చట్టాల అమలులో వెనుకబడిన యూనిట్లపై సమీక్ష
హైదరాబాద్, వెలుగు: కేసుల దర్యాప్తుతో పాటు నూతన క్రిమినల్ చట్టాలను పటిష్టంగా అమలు చేయడంలో పోలీసు సిబ్బంది నైపుణ్యాన్ని పెంచుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. వివిధ అంశాల్లో వెనుకబడిన పోలీస్ యూనిట్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. లోపాలను గుర్తించి పనితీరును మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు. క్రిమినల్ చట్టాల అమలులో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, జయశంకర్ భూపాలపల్లి, రామగుండం కమిషనరేట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా క్రైమ్ ర్యాంకింగ్‌లో వెనుకబడిన యూనిట్ల కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో గురువారం సీఐడీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేసుల పరిష్కారం, లైంగిక నేరాల ట్రాకింగ్, పెండింగ్ కేసుల సత్వర దర్యాప్తు ఈ-సాక్ష్య తదితర అంశాలను యూనిట్ల వారీగా సమీక్షించారు. జీరో ఎఫ్‌ఐఆర్, ఆన్‌లైన్ చార్జిషీట్, ఈ-సాక్ష్య, ఈ-సమన్లు, న్యాయ సూత్రాలను సమర్థంగా అమలు చేస్తే రాష్ట్ర ర్యాంకింగ్ మెరుగుపడుతుందని డీజీపీ పేర్కొన్నారు. ఈగల్ ఫోర్స్ పనితీరు, సైబర్ నేరాల నియంత్రణలో రాష్ట్ర పోలీసుల ప్రతిభను ఆయన అభినందించారు.
