క్యాన్సర్ రోగులకు ఏటా దాదాపు రూ.2,500 కోట్ల మేర ఊరట
న్యూఢిల్లీ: మార్కెట్‌లో క్యాన్సర్ మందుల ధరలను భారీగా తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నాన్-షెడ్యూల్డ్ రకాల క్యాన్సర్ మందుల ట్రేడ్ మార్జిన్‌పై 30 శాతం సీలింగ్ విధించాలని నిర్ణయించింది. కేంద్ర ఔషధ విభాగం వర్గాల ప్రకారం.. ఈ నిర్ణయంతో కొన్ని రకాల క్యాన్సర్ మందుల ఎంఆర్‌పీ ఏకంగా 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.
దీని ద్వారా దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు ఏటా దాదాపు రూ.2,500 కోట్ల వరకు ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ తాజా నిబంధన బ్రాండెడ్, జెనెరిక్ ఔషధాలతో పాటు దేశీయంగా తయారయ్యే, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పేటెంట్, నాన్-పేటెంట్ మందులన్నింటికీ వర్తిస్తుంది.
కాగా, క్యాన్సర్ మందుల అసలు ధరకు, ప్యాకెట్‌పై ముద్రించే ఎంఆర్‌పీకి మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రూ.2,700కే రీటైలర్‌కు దొరికే ఒక క్యాన్సర్ మందుపై ఏకంగా రూ.27,000 ఎంఆర్‌పీ వేసి అమ్ముతుండటాన్ని న్యాయస్థానం ఎత్తిచూపింది. ఇది రోగులను నిలువుదోపిడీ చేయడమే అని మండిపడింది.
ప్రాణాలను కాపాడే అత్యవసర మెడిసిన్స్‌పై ఇంతటి భారీ వ్యత్యాసాన్ని ఎలా అనుమతిస్తారని నిలదీసింది. అంతేకాకుండా, ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద అధిక ధరలతో మందులు కొనుగోలు చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులపైనే ఆ భారం పడుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. మరోవైపు, 2019లో కూడా ప్రభుత్వం క్యాన్సర్ మందుల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. దీనివల్ల 526 బ్రాండ్లపై రోగులకు ఏటా రూ.984 కోట్ల మేర ఆదా జరిగినట్లు కేంద్రం వెల్లడించింది.
