పెయిడ్ వర్కర్లతో యువ సంగ్రామం.. మీటింగ్కు హరీశ్, గుంటకండ్ల ఎందుకు రాలే..

పెయిడ్ వర్కర్లతో యువ సంగ్రామం.. మీటింగ్కు హరీశ్, గుంటకండ్ల ఎందుకు రాలే..
  • కేసీఆర్​కే కేటీఆర్ వారసుడు.. బీఆర్​ఎస్​కు కాదు : ఎమ్మెల్యే మందుల సామేల్

యాదాద్రి, వెలుగు : 'బీఆర్​ఎస్​ నిర్వహించిన యువ సంగ్రామంలో అందరూ పెయిడ్​వర్కర్లే పాల్గొన్నారు, అసలైన వాళ్లెవరూ రాలేదు' అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కు వారసుడు కేటీఆరే.. కానీ బీఆర్​ఎస్​కు మాత్రం కాదన్నారు. అందుకే పెద్ద లీడర్​లెక్క యువ సంగ్రామం నిర్వహించినా.. హరీశ్, పద్మారావు, జగదీశ్​రెడ్డి వంటి వాళ్లెవరూ రాలేదన్నారు. 

కేటీఆర్​ఇంకా చిన్న పిల్లాడి మాదిరిగానే వ్యవహరిస్తున్నారన్నారు. భవిష్యత్​లో బీఆర్​ఎస్ ఉండదని, కేటీఆర్​మళ్లీ అమెరికాకు వెళ్లాల్సిందేనన్నారు. కేటీఆర్​మంత్రి పదవితో ఎంజాయ్​చేశారే తప్ప.. మున్సిపల్​ కార్మికులకు ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్​ను అసెంబ్లీకి ఎందుకు రానిస్తలేరని, ఆయన అసెంబ్లీకి వస్తేనే గౌరవం ఉంటుందన్నారు.

 బీఆర్​ఎస్​ హయాంలో   రైతులకు బేడీలు వేయించారని, నేరెళ్ల బాధితులు ఇంకా అనారోగ్యంతోనే బాధపడుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్​పై అవాకులు చవాకులు పేలవద్దన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ పార్టీలో నెలకొన్న విబేధాలు సమసిపోయాయని చెప్పారు. జగ్గారెడ్డి చెప్పినట్టుగా తరచుగా గొడవ పడలేమన్నారు. ఉపాధి కోసం ముంబై, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని బీఎల్​ఏలకు సూచించారు. ఎల్​నినో కారణంగా వానలు కురుస్తలేవని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు.