
- సీపీఎంతో చర్చలు సాగిస్తున్న బీఆర్ఎస్
- పొత్తులపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పొత్తులపై పొలిటికల్పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్తో సీపీఐ కలిసి పనిచేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాజకీయ పరిస్థితులను బట్టి ఆయా పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని సీపీఎం భావిస్తోంది. మరోవైపు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సీపీఎంతో చర్చలు సాగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈనెల 8న హైకోర్టు తీర్పు నేపథ్యంలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కాంగ్రెస్తోనే సీపీఐ దోస్తీ..
కాంగ్రెస్తోనే సీపీఐ జత కట్టే అవకాశాలు ఉన్నాయి. గత అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించింది. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సీపీఐ మద్ధతిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్, సీపీఐ పొత్తుతో ముందుకు సాగనున్నాయి. పొత్తుల విషయంలో సీపీఎంతో సీపీఐ చర్చలు జరుపుతోంది.
జిల్లాల్లో పరిస్థితులను బట్టి పొత్తులు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాల్లో పురిస్థితులను బట్టి పొత్తులు పెట్టుకునే వెసులుబాటును సీపీఎం అధిష్టానం ఆయా జిల్లాల కమిటీలకు ఇచ్చింది. ఇటీవల జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పొత్తులపై సీపీఎం అధిష్టానం సుదీర్ఘంగా చర్చించింది. మొదటగా వామపక్ష ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా లీడర్లకు సూచించింది. తాము అడిగిన స్థానాల్లో గౌరవ ప్రదమైన స్థానాలు ఇస్తే కలిసి వచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని సీపీఎం నేతలు చెబుతున్నారు.
లేనిపక్షంలో తమతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామని, పొత్తులపై స్పష్టత రాకుంటే తాము ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు.. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లుతో పొత్తులపై ఇప్పటికే చర్చించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్తో కలిసి సీపీఎం పనిచేసే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.