
హైదరాబాద్ : పాతబస్తీలో రైవల్ గ్యాంగ్స్ రెచ్చిపోయాయి. సినిమాల్లో చూసినట్టుగానే… తన శత్రువును కాపుకాచి తల్వార్లతో వెంటాడి మరీ అతి కిరాతకంగా హతమార్చింది ప్రత్యర్థి గ్యాంగ్. సౌత్ జోన్ పాతబస్తీ మొఘల్ పురా పరిధిలో ఈ సంఘటన సంచలనం రేపుతోంది.
అమీర్ అనే రౌడీ షీటర్ ను నిన్న రాత్రి ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. మృతుని తల మెడపై, కడుపులో కొన్ని చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. విచక్షణ లేకుండా పొడిచి చంపేసి పరారయ్యారు అతడి శత్రువులు. తీవ్రమైన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు అమీర్. సంఘటనా స్థలానికి మొఘల్ పురా పోలీసులు, క్లూస్ టీమ్స్ చేరుకున్నాయి. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి పంపించారు పోలీసులు.
పక్కాగా ప్లాన్ వేసుకొని రౌడీ షీటర్ అమీర్ ను ప్రత్యర్థులు వెంటాడి కత్తులతో హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ నేరంలో నిందితులను పట్టుకుంటామని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతి చెందిన వ్యక్తిపై కంచన్ బాగ్ పీఎస్ లో కొన్ని కేసులు నమోదై ఉన్నాయి. గతంలో అతడిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు పోలీసులు.