థానే కేంద్రంగా పనిచేసే టెక్ కన్సల్టింగ్ కంపెనీ 'సిల్వర్‌లైన్ టెక్నాలజీస్' షేరు ధర మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం 26 రోజుల్లోనే ఈ స్టాక్ ఏకంగా 100 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ అసాధారణ ర్యాలీపై ఇన్వెస్టర్లను BSE అప్రమత్తమైంది. ఈ స్టాక్ విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగువేయాలని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని బీఎస్ఈ హెచ్చరిక జారీ చేసింది.
సిల్వర్‌లైన్ టెక్నాలజీస్ షేరు ప్రయాణాన్ని గమనిస్తే.. జనవరి 19న దీని ధర కేవలం రూ.7.81 వద్ద ఉండేది. ఫిబ్రవరి 16 నాటికి ఇది రూ.16.15కు చేరుకుంది. అంటే కేవలం ఒక నెల లోపే ఇన్వెస్టర్ల సంపద రెట్టింపు అయింది. ముఖ్యంగా ఫిబ్రవరి 9 నుండి ఒక వారంలోనే ఈ స్టాక్ 27 శాతం మేర ఎగబాకింది. ఫిబ్రవరి 16న కూడా 5 శాతం ఎగువ సర్క్యూట్‌ను తాకి రూ.16.15 వద్ద ముగియడం ఈ స్టాక్ పట్ల పెరుగుతున్న ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోంది. మంగళవారం కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యి అప్పర్ సర్క్యూట్ తాకింది పెన్నీ స్టాక్.
కేవలం ధర పెరగడమే కాకుండా ఈ స్టాక్ ట్రేడింగ్ పరిమాణం కూడా అమాంతం పెరగడం నిపుణులను కలవరపెడుతోంది. గతంలో రోజుకు సగటున 31 లక్షల షేర్ల లావాదేవీలు జరిగే చోట, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా కోటి షేర్లకు చేరుకుంది. ఎటువంటి బలమైన సంస్థాగత ప్రకటనలు లేదా ప్రాథమిక మార్పులు లేకుండానే ఇంత భారీ స్థాయిలో షేర్ల క్రయవిక్రయాలు జరగడం మార్కెట్ ఊహాగానాలకు తావిస్తోంది.
బీఎస్ఈ హెచ్చరిక ఏమిటి..?
ఈ పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈ తన ఎక్స్ ఖాతా ద్వారా ఇన్వెస్టర్లకు కీలక సూచనలు చేసింది. సిల్వర్‌లైన్ టెక్నాలజీస్ షేర్లను కొనుగోలు చేయమని వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో 'అన్‌సోలిసిటెడ్ మెసేజెస్' భారీగా ప్రచారమవుతున్నట్లు ఎక్స్ఛేంజ్ గుర్తించింది. ఇలాంటి సందేహాస్పదమైన సలహాల ఆధారంగా పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దని, కేవలం రిజిస్టర్డ్ అనలిస్టుల సలహాలను మాత్రమే పాటించాలని సూచించింది. తక్కువ ధర ఉన్న స్టాక్స్ ఒక్కసారిగా పెరిగినప్పుడు లాభాల ఆశతో ఇన్వెస్టర్లు వాటి వైపు పరుగులు తీస్తుంటారు. కానీ సిల్వర్‌లైన్ విషయంలో బీఎస్ఈ హెచ్చరికను గమనిస్తే, ఇది 'పంప్ అండ్ డంప్' స్కీమ్ అయ్యే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి ఇన్వెస్టర్లు.
కంపెనీ గ్రోత్ స్టోరీ..
సిల్వర్‌లైన్ టెక్నాలజీస్ ఇటీవలే SilverAI పేరుతో ఏఐ ఎనేబుల్డ్ వెబ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించగా, దానికి మార్కెట్‌లో అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే ఈ ప్లాట్‌ఫామ్ 24 వేల మంది యూజర్లను సంపాదించుకోగా, రాబోయే 45 రోజుల్లో ఈ సంఖ్య 5 లక్షలకు చేరుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. యూజర్లను మరింత ఆకట్టుకునేందుకు నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఫీజును 9 డాలర్లకు తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది. ఈ వ్యూహం ద్వారా రిజిస్టర్డ్ యూజర్లు పెరగడమే కాకుండా, కంపెనీ ఆదాయం కూడా భారీగా వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.
