కు.ని. బాధితుల గోస పట్టదా?

కు.ని. బాధితుల గోస పట్టదా?

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇబ్రహీంపట్నం ఫ్యామిలీ ప్లానింగ్ లో నలుగురు మహిళలు చనిపోయారని బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. పిల్లలు అనాథలయ్యారని, 9 నెలల పసి పిల్లలు తల్లి పాలు లేకుండా ఎలా బతుకుతారని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని, సిగ్గుంటే వెంటనే కేబినెట్​ రాజీనామా చేయాలన్నారు. లింగంపల్లి గ్రామంలో మైలారం సుష్మతో పాటు సీతారాంపేటలోని ఔటపురం లావణ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడారు. మహిళలు చనిపోయిన టైంలో అమెరికాలో ఉండటంతో రాలేపోయానని, వార్త తెలిసి చాలా బాధపడ్డానని తెలిపారు. 

బాధితులను ఆదుకోవడంలో విఫలం

బాధిత కుటుంబాలకు ఇండ్లు కట్టించి ఇవ్వడంలోనూ ప్రభుత్వం విఫలమైందని, లావణ్య కుటుంబానికి ఇల్లు లేక ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఉంటోందని ఆర్​ఎస్ ​ప్రవీణ్​ కుమార్​ అన్నారు. బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించి ప్రభుత్వం  చేతులు దులుపుకుందని మండిపడ్డారు. మహిళల చావుకు కారణమైన హెల్త్ మినిస్టర్ హరీశ్​ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ, బీహార్, కర్నాటక రాష్ట్రాలు తిరగడానికి సీఎం కేసీఆర్​కు టైం ఉంది కానీ.. ఓటేసి గెలిపించిన మహిళలు చనిపోతే వారి కుటుంబాన్ని పరామర్శించే సమయం లేదా? అని నిలదీశారు. బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, పిల్లల చదువులన్నీ ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.