
- కేసీఆర్ ఫ్యామిలీ వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసింది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్/కాశీబుగ్గ, వెలుగు: బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను రిలీజ్ చేసింది. ఫస్ట్ లిస్ట్‌లో ప్రకటించిన 20 మందిని కలిపి మొత్తం 63 అసెంబ్లీ స్థానాలకు క్యాండిడేట్ల డిసైడ్ చేసింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం సీటును ట్రాన్స్ జెండర్ చిత్రపు పుష్పిత లయకు కేటాయించారు. తనకు అవకాశం కల్పించినందుకు స్టేట్ చీఫ్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను కలిసి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం బీఎస్పీ ఆఫీసులో లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రెండు విడతల్లో కలిపి బీసీలకు- 26, ఎస్సీలకు -21, ఎస్టీలకు 11, ఓసీలకు -3, మైనార్టీలకు 2 సీట్లు కేటాయించినట్లు చెప్పారు.
ఎన్నికల్లో ఓట్ల కోసం మోసపూరిత హామీలు ఇచ్చే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లకు ఓట్లు వేయవద్దన్నారు. తెలంగాణలో బీసీని సీఎం చేస్తానన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. బీసీ కులాలకు చెందిన బండి సంజయ్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటేనే ఓర్వలేని బీజేపీ.. బీసీని సీఎం చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ ప్రధానిగా ఉన్నా దేశవ్యాప్తంగా బీసీ కులగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో డబ్బులు పంచే, ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు ఓట్లను అమ్ముకోవద్దన్నారు. జనాభాలో 99 శాతం పేదలకు అధికారం దక్కాలన్నదే బీఎస్పీ లక్ష్యమని చెప్పారు.