ప్రభుత్వం విద్యను ప్రైవేట్​పరం చేస్తోంది

ప్రభుత్వం విద్యను ప్రైవేట్​పరం చేస్తోంది

దేవరకొండ, వెలుగు: ప్రగతిభవన్​లో పాగా వేయడమే బహుజనుల లక్ష్యం కావాలని బీఎస్పీ స్టేట్​ చీఫ్ ​కోఆర్డినేటర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​అన్నారు. ఆదివారం రాత్రి నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్​ ఆవరణలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంత్​శ్రీ సేవాలాల్​ మహరాజ్​ ఆశయ సాధన సదస్సులో ఆయన మాట్లాడారు. దేవరకొండ ప్రాంత ప్రజలు ఉపాధి లేక హైదరాబాద్​ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లి రోజుకు రెండు నుంచి మూడు వందల కూలి సంపాదిస్తుంటే.. సీఎం కేసీఆర్​ నెలకు రూ 4.25 లక్షల జీతం తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నక్కలగండి, పుట్టంగండి, గొట్టిముక్కల ప్రాజెక్టులతో నిర్వాసితులైన గిరిజనులు వారి భూముల్లోనే కూలీలుగా మారడం బాధాకరమన్నారు.  గిరిజన స్టూడెంట్లు చదివే యూనివర్సిటీల్లో 3 వేల లెక్చరర్ ​పోస్టు​లు ఉండగా వీటిలో 1800 ఖాళీగా ఉన్నాయన్నారు. ఇలాగైతే తమ బిడ్డలకు నాణ్యమైన విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యను ప్రైవేట్​పరం చేస్తోందన్నారు. విద్యను ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచనతోనే రాష్ట్రంలో విజ్ఞాన్, అనురాగ్, మల్లారెడ్డి యూనివర్సిటీలు వచ్చాయని ఆరోపించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే దేవరకొండను సేవాలాల్​జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు వెంకటేశ్​చౌహాన్, మాలావత్​పూర్ణ, జానపద గాయకుడు సుక్క రాంనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.