బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను50 శాతానికి పెంచాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను50 శాతానికి పెంచాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను50 శాతానికి పెంచాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. 50 శాతానికి పైగా జనాభాకు 27 శాతం రిజర్వేషన్లా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవమైన 26వ తేదీ నుంచి వరుస ఆందోళనలు చేస్తామన్నారు. ప్రజాస్వామికవాదులు వెంట నడవాలని పిలుపునిచ్చారు. గురువారం బీఎస్పీ స్టేట్ ఆఫీస్​లో ప్రవీణ్ కుమార్​ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు.. పెరిగిన జనాభాకు అనుగుణంగా పెంచాలన్నారు. 1932 తర్వాత ఇప్పటి దాకా బీసీ కులాల లెక్కలు ఎందుకు తీయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ కుల లెక్కలు తీయాలని, రాజ్యసభలో, సుప్రీం, హైకోర్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, బీసీ క్రీమిలేయర్​ విధానం ఎత్తేయాలన్నారు. ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్స్​లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వాటా కల్పించాలని కోరుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేసి రాష్ట్రపతికి పంపుతామని వెల్లడించారు. 

సిఫార్సులు అమలు చేయాలి

1953లో ఏర్పాటైన కాలేల్కర్ కమిషన్, 1979లో ఏర్పాటైన మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బీసీలను మోసం చేశాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కేవలం రాజకీయాలు, ఓట్ల కోసం మాత్రమే బీసీలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఎలాంటి జనగణన లేకుండానే ఈడబ్ల్యూఎస్​ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి 103వ రాజ్యాంగ సవరణ చేసినపుడు, బీసీ రిజర్వేషన్ల కోసం ఎందుకు సవరణ చేయరని ప్రశ్నించారు.