ఎంఎస్ఎంఈలకు రూ.10 వేల కోట్లు.. చట్టపరమైన సాయం కోసం కార్పొరేట్ మిత్ర

ఎంఎస్ఎంఈలకు రూ.10 వేల కోట్లు.. చట్టపరమైన సాయం కోసం  కార్పొరేట్ మిత్ర
  • ఈ నిధులతో ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ఏర్పాటు

న్యూఢిల్లీ: మైక్రో, స్మాల్​, మీడియం ఎంటర్​ప్రైజెస్​(ఎంఎస్ఎంఈ)ను చాంపియన్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్​లో భారీగా నిధులు కేటాయించింది. దేశ ఆర్థిక వృద్ధికి  కీలకమైన ఈ రంగంలోని పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు రూ.10 వేల కోట్లతో ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ఏర్పాటును ప్రతిపాదించింది.  ఈక్విటీ మద్దతు, నగదు లభ్యత,  వృత్తిపరమైన సహకారం వంటి సూత్రాల  ఆధారంగా దీనిని తీసుకొచ్చారు. 2021లో ప్రారంభించిన సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్‌‌కు అదనంగా రూ.రెండు వేల కోట్లు కేటాయించారు. 

దీనివల్ల సూక్ష్మ పరిశ్రమలకు పెట్టుబడులు సులువుగా దొరుకుతాయి. ఎంఎస్ఎంఈలకు సకాలంలో నగదు అందేలా ట్రెడ్స్ ప్లాట్ ఫామ్ వినియోగాన్ని పెంచాలని నిర్ణయించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్ఎంఈల నుంచి చేసే కొనుగోళ్ల చెల్లింపులను తప్పనిసరిగా ట్రెడ్స్ ద్వారానే జరపాలని ప్రతిపాదించారు. దీనివల్ల ఇప్పటి వరకు రూ.7 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈలకు అందుబాటులోకి వచ్చాయి. జెమ్ పోర్టల్ ను ట్రెడ్స్ తో అనుసంధానించడం ద్వారా తక్కువ వడ్డీకే వేగంగా అప్పులు పొందే అవకాశం కలుగుతుంది. 

చిన్న నగరాల్లో ఎంఎస్ఎంఈలకు చట్టపరమైన నిబంధనల అమలులో సహాయం చేసేందుకు కార్పొరేట్ మిత్ర అనే నూతన వ్యవస్థను తీసుకురానున్నారు.   పన్ను చెల్లింపుల్లో పొరపాట్లు జరిగితే వాటిని సరిదిద్దుకోవడానికి ఎంఎస్ఎంఈలకు అదనపు సమయం ఇస్తారు. చిన్న పొరపాట్లకు భారీ జరిమానాలు వేయకుండా ఫీజులతో సరిపెట్టేలా నిబంధనలు మార్చారు. మ్యాన్ పవర్ సప్లైపై టీడీఎస్ విధానాన్ని సరళీకృతం చేయడం ద్వారా కార్మిక ఆధారిత పరిశ్రమలకు   ఊరట లభించనుంది.