కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న వేళ దేశంలోని కోట్లాది మంది సీనియర్ సిటిజన్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైపు ఆశగా చూస్తున్నారు. గత బడ్జెట్ లో సామాన్య పన్ను చెల్లింపుదారులకు రూ.12లక్షల 75వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి ఉపశమనం లభించినప్పటికీ.. వృద్ధులకు మాత్రం ఎలాంటి ప్రత్యేక రాయితీలు దక్కలేదు. దీంతో న్యూటాక్స్ రీజిమ్ కింద తమకు కూడా ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని సీనియర్ సిటిజన్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న కొత్త పన్ను విధానంలో 60 ఏళ్ల లోపు వారికీ.. 80 ఏళ్ల పైబడిన వారికీ ఒకే రకమైన పన్ను స్లాబ్‌లు ఉన్నాయి. ఇది ఏమాత్రం సమంజసం కాదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాత పన్ను విధానంలో సీనియర్ సిటిజన్లకు రూ.3 లక్షలు, సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షల వరకు ప్రాథమిక మినహాయింపు ఉండేది. కానీ కొత్త విధానంలో ఈ వ్యత్యాసాన్ని తొలగించి అందరికీ రూ.4 లక్షలనే ప్రాథమిక మినహాయింపుగా ఉంచారు. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని, వృద్ధులకు పన్ను భారతాన్ని తగ్గించేలా ప్రత్యేక స్లాబ్‌లను తిరిగి తీసుకురావాలని ట్యాక్స్ నిపుణుడు బలవంత్ జైన్ వంటి వారు కోరుతున్నారు.
వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు భారీగా పెరుగుతాయి. ప్రస్తుతం సెక్షన్ 80డి కింద ఉన్న హెల్త్ బెనిఫిట్స్ సరిపోవని, ముఖ్యంగా కొత్త పన్ను విధానంలో అనేక మినహాయింపులు అందుబాటులో లేకపోవడం వృద్ధులకు భారంగా మారుతోందని ట్యాక్స్2విన్ సీఈఓ అభిషేక్ సోని పేర్కొన్నారు. వృద్ధుల ఆదాయం పెన్షన్, వడ్డీలుపై పడే పన్ను ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రాథమిక మినహాయింపు పరిమితిని పెంచడంతో పాటు, వైద్య ఖర్చుల కోసం అదనపు మినహాయింపులను అనుమతించాలని వారు కోరుతున్నారు.
2026 బడ్జెట్ నుంచి ఏం కోరుకుంటున్నారు?
సీనియర్ సిటిజన్ల ప్రధాన డిమాండ్ ఒక్కటే - 'వయసును బట్టి పన్నులో వెసులుబాటు'. యువతతో సమానంగా వృద్ధులు కూడా పన్ను చెల్లించడం సామాజిక న్యాయం కాదని.. 60 ఏళ్లు పైబడిన వారికి అధిక మినహాయింపు పరిమితిని లేదా తక్కువ పన్ను రేట్లను కేటాయించాలని వారు కోరుతున్నారు. బడ్జెట్ 2026లో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయకపోతే, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు వైద్య ఖర్చుల మధ్య వృద్ధుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
