ఏప్రిల్ 8 వరకు బడ్జెట్ సమావేశాలు

 ఏప్రిల్ 8 వరకు బడ్జెట్ సమావేశాలు

న్యూఢిల్లీ: దేశ ఎకనామిక్ యాక్టివిటీ కరోనా ముందు స్థాయిలకు చేరుకుంటోంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతంగా ఉంటుందని  నేషనల్ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌‌ అంచనావేయడాన్ని గమనించాలి.  ప్రస్తుతం ఉన్న ఎకనామిక్ ముమెంటం కొనసాగాలంటే రానున్న బడ్జెట్‌‌ కేటాయింపులు చాలా కీలకమన్న విషయం తెలిసిందే. 2022–23 లో దేశ ఎకనామిక్ గ్రోత్‌‌కు పెరుగుతున్న ఇన్‌‌ఫ్లేషన్‌‌, కరోనా కేసులు సమస్యలుగా ఉన్నాయని పీడబ్ల్యూసీ ఇండియా ఎకనామిక్ అడ్వైజరీ సర్వీసెస్ పార్టనర్‌‌‌‌ రనెన్‌‌ బెనర్జీ పేర్కొన్నారు.  వినియోగం పెరగడంలోనూ, చిన్న పరిశ్రమలు కరోనా ఒత్తిడి నుంచి బయటపడడంలోనూ సమస్యలు ఉన్నాయని చెప్పారు.  అందుకే ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌‌లో క్యాపిటల్ ఎక్స్‌‌పెండిచర్‌‌‌‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని, వినియోగం పెంచేందుకు ప్రజలకు ఆర్థికంగా సపోర్ట్ అందించాలని,  చిన్న కంపెనీలు, అన్‌‌ఆర్గనైజ్డ్ సెక్టార్‌‌‌‌కు అప్పులు ఈజీగా అందేలా చేయాలని పేర్కొన్నారు. రోడ్డులు, హైవేలు, రైల్వేలు, పవర్‌‌‌‌, హౌసింగ్, అర్బన్ ట్రాన్స్‌‌పోర్టేషన్ వంటి ప్రాజెక్ట్‌‌లకు బడ్జెట్‌‌లో ఎక్కువగా కేటాయింపులు జరగాలని బెనర్జీ అభిప్రాయపడ్డారు. దీంతో  ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుందని, ఎంప్లాయ్‌‌మెంట్ పెరుగుతుందని అన్నారు. ఎంజీఎన్‌‌ఆర్‌‌‌‌ఈజీఏ కేటాయింపులు పెంచాలని చెప్పారు. క్యాపిటల్ ఎక్స్‌‌పెండిచర్ పెంచే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని, పబ్లిక్ బ్యాంకులకు క్యాపిటల్ అందించాలని అన్నారు. చిన్న కంపెనీల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌‌ను కొనసాగించాలని పేర్కొన్నారు. రియల్‌‌ ఎస్టేట్‌‌, హౌసింగ్ సెక్టార్లలో ఉద్యోగాలు పెరిగేలా చేయాలని చెప్పారు.  జనాలు ఎక్కువగా వాడే ప్రొడక్ట్‌‌లపై జీఎస్‌‌టీ తగ్గించి, వినియోగం పెంచాలన్నారు.

బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 8 వరకు..
బడ్జెట్ పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి స్టార్టయ్యి, ఏప్రిల్ 8 వరకు కొనసాగుతాయి. జనవరి 31 న ఎకనామిక్ సర్వే విడుదల చేస్తారు. ఫిబ్రవరి 1 న 2022–23 ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ సారి బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో జరుగుతాయి. మొదటి దశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు , రెండో ఫేజ్ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగుతాయి.