- తెలంగాణ, హైదరాబాద్‌ను మూడు ముక్కలు ..
- చేయడం తప్ప విషయం లేదు:
- సభ నుంచి వాకౌట్.. బడ్జెట్ పేపర్లు చించి..
- చెవిలో పూలు పెట్టుకుని బీఆర్ఎస్ సభ్యుల నిరసన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలను బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. ఆరు గ్యారంటీలకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గోరి కట్టారని మండిపడ్డారు. బడ్జెట్ ప్రసంగంలో 20 పేజీలు పెంచడం.. బడ్జెట్లో రూ.20 వేల కోట్ల పెంచడం తప్ప ఆరు గ్యారంటీల ప్రస్తావనగానీ, వాటికి నిధుల కేటాయింపులుగానీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగితాల మీద అంకెలున్నాయితప్ప.. ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. బడ్జెట్‌పై శుక్రవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడారు. గత బడ్జెట్లో చెప్పిన పథకాలేవీ అమలు చేయలేదని, మళ్లీ అవే ఈ సారి కూడా పెట్టారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్లు ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల అభివృద్ధి కోసం కాదన్నది బడ్జెట్ నిరూపించిందన్నారు.
‘‘పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసం కోసం రూ.6 వేల కోట్లు అన్నరు.. ఈసారి రూ.6 వేల కోట్లు అన్నరు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకూ ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క పైసా ఖర్చు చేయలేదు. ఈ బడ్జెట్ అంకెల గారడీ తప్ప శాంక్టిటీ లేదు. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీల పేర్లు చెప్పి.. వాళ్ల ఆత్మ క్షోభించేలా చేస్తున్నరు. భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్.. బడా జూటా బడ్జెట్.. ఇదొక వట్టి బడ్జెట్. అభయహస్తం కాదు రిక్త హస్తం అని అర్థమైంది’’ అని ఆయన మండిపడ్డారు.
కాగా, అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బడ్జెట్‌పై నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. బడ్జెట్ పేపర్లను చించేసి ఎమ్మెల్యేల ఎంట్రీ పాయింట్ వద్ద వేశారు. చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలియజేశారు.
విషయం లేదు..
తెలంగాణను, హైదరాబాద్‌ను మూడు ముక్కలు చేయడం తప్ప బడ్జెట్లో విషయం లేదని హరీశ్ రావు అన్నారు. పింఛన్ల పెంపు లేదని, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ గురించి మాట్లాడలేదని, కేవలం మొండి చెయ్యి చూపించారని విమర్శించారు.
‘‘ఆర్టీసీ కార్మికులకు మొండి చేయి.. సింగరేణి కార్మికులకు మొండి చేయి.. ముదిరాజులకు, గౌడన్నలకు, గొల్ల కుర్మలు, ఎస్సీ ఎస్టీలు, మహిళలు, ఆశా అంగన్వాడీలు, మైనారిటీలు సహా అందరికీ మొండి చెయ్యి చూపించారు.
మూడేళ్లు నిండకముందే మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేసిండు. చరిత్రలో ఎన్నడూ లేనంత అప్పు పెరిగింది. 27 శాతం నుంచి 28 శాతానికి పెంచారు. స్కాంలు తప్ప స్కీంలు ఉన్నాయా? పెట్టుబడుల విషయంలో అవే కట్టు కథలు. ఏ కంపెనీ, ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని పెట్టుబడులు వచ్చాయన్నదానిపై శ్వేత పత్రం విడుదల చేయండి.
విదేశాలకు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు అక్రమ సంపాదన భద్రపరుచుకోవడానికి. దేశ సగటుకన్నా తెలంగాణ జీఎస్డీపీ అధికంగా ఉందని భట్టి అన్నరు. రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రం దివాళా తీసిందంటున్నరు’’ అని ఆయన అన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ కాదు.. చోర్ మోడల్, గోల్ మాల్ మోడల్ అని ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు యంగ్ ఇండియా స్కూళ్లు ఇవ్వట్లే
రాష్ట్రంలో ఇప్పటిదాకా 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పూర్తి చేసినా.. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఇవ్వలేదని హరీశ్ రావు ఆరోపించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, అలాగే కొందరు బీజేపీ ఎమ్మెల్యేలకు మాత్రం స్కూళ్లు కేటాయించారన్నారు. శుక్రవారం ఆయన బీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో చిట్‌చాట్ చేశారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో భారీ అవినీతి జరుగుతోందన్నారు. కాంట్రాక్టర్లు ఆర్గనైజ్డ్ రింగ్ గా మారి పనులను పంచుకుంటున్నారన్నారు. ‘‘టెండర్లలో కనిష్టంగా 4.59% నుంచి గరిష్టంగా 4.96% ఎక్సెస్‌తో కొల్లగొట్టారు. ఒక్కో స్కూలుకు రూ.250 కోట్లు కేటాయించగా, అందులో సివిల్ వర్క్స్ కోసమే సుమారు రూ.150 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు.
76 స్కూళ్లకు సంబంధించి ప్రభుత్వ అంచనా వ్యయం రూ. 10,199.54 కోట్లు కాగా, కాంట్రాక్టర్లు దాన్ని రూ. 10,693.55 కోట్ల ఎక్సెస్‌తో దక్కించుకున్నారు. అంటే కేవలం ఈ టెండర్ల ద్వారా సుమారు రూ. 494 కోట్లు ప్రజాధనాన్ని అదనంగా దోచిపెడుతున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రుల నియోజకవర్గాల్లో అత్యధికంగా 4.95% ఎక్సెస్ ధరకు టెండర్లు కేటాయించడం పలు అనుమానాలు కలిగిస్తున్నది’’ అని ఆయన పేర్కొన్నారు.
