కియా ఎక్కడికీ పోదు

కియా ఎక్కడికీ పోదు

అమరావతి, వెలుగు:

ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఏపీ నుంచి తరలిపోవట్లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం  స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలోని ప్లాంట్ ను తమిళనాడుకు తరలించేందుకు కియా ప్రయత్నిస్తోందన్న రాయిటర్స్  వార్తలను ఆయన ఖండించారు. మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అధికారం పోయిందనే బాధలో ఏపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి మీడియాను మేనేజ్ చేసి తప్పుడు కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే వార్తలు రాసే మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ కియా పరిశ్రమపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు. రూ.14 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన కియా ప్లాంట్ వల్ల 12 వేల మందికి పైగా ఉపాధి లభించిందని తెలిపారు. కియాకు టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న రూ. 3,500 కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఏపీలో కియా ప్లాంట్ కొనసాగడానికి, విస్తరణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

పార్లమెంటులోనూ కియాపై చర్చ

ఏపీ నుంచి కియా తమిళనాడుకు తరలిపోతోందన్న అంశం పార్లమెంటులోనూ చర్చకు వచ్చింది. గురువారం టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఏపీలో అమరావతి తరలింపు, 3 రాజధానులు ఏర్పాటు, ప్రభుత్వ అరాచకాలతో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీనిపై వైసీపీ పక్ష నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. కియా ఏపీలోనే కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు. కియా ఎండీతో ఈ అంశంపై మాట్లాడినట్లు చెప్పారు.