బ్రేకులు లేని వెండి.. డిమాండ్ ఎక్కువ.. సప్లై తక్కువ..ఒక్కరోజే రూ.20 వేలు జంప్..కిలో ధర రూ.3.23 లక్షలు

బ్రేకులు లేని వెండి.. డిమాండ్ ఎక్కువ.. సప్లై తక్కువ..ఒక్కరోజే రూ.20 వేలు జంప్..కిలో ధర రూ.3.23 లక్షలు
  • కేజీ ధర రూ.3.23 లక్షలు
  • 20 రోజుల్లో రూ.85 వేలు పైకి​
  • బంగారం@రూ.1.50 లక్షలు

న్యూఢిల్లీ:దేశ రాజధానిలో మంగళవారం వెండి ధర సరికొత్త రికార్డుస్థాయికి చేరింది.   కిలో ధర రూ.20,400 పెరగడంతో మార్కెట్లో మొదటిసారిగా రూ.3.23 లక్షల స్థాయికి చేరుకుంది.  దీని ధరలు గత 20 రోజుల్లోనే రూ. 85 వేల మేర పెరిగాయి. ఈ ఏడాది ఆరంభంలో రూ.2.38 లక్షలు ఉన్న వెండి ధర ఇప్పుడు రూ.3.23 లక్షలు దాటింది. బంగారం ధరలూ వెండితో పోటీ పడ్డాయి. ఢిల్లీలో పది గ్రాముల ధర రూ.5,100 పెరిగి రూ.1,53,200లకు ఎగబాకింది. 

సోమవారం దీని ధర రూ.1.48 లక్షల వద్ద ముగిసింది.  ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం, వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగాయి.  ఈ నెల 20 వరకు పది గ్రాముల బంగారం ధర సుమారు రూ.18 వేల మేర పెరిగింది.  ఈ స్థాయిలో ధరలు పెరగడం దేశీయ బులియన్​ మార్కెట్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. 

ఎందుకింత డిమాండ్​ ?

పారిశ్రామిక రంగం నుంచి ఎన్నడూ లేనంత డిమాండ్​ ఉండటంతో వెండి పరుగు ఆగడం లేదు. సోలార్​ ప్యానెల్స్​, ఈవీల తయారీ,  డేటా సెంటర్ల లో, గ్రీన్ ఎనర్జీ రంగంలో దీని వాడకం గణనీయంగా పెరిగింది.  సరఫరా కంటే గిరాకీ ఎక్కువగా ఉండటం వల్ల వెండి ధరలు ఈ స్థాయిలో పెరుగుతున్నాయి. 

అమెరికా డాలర్ విలువ బలహీనపడటం కూడా భారత్ లాంటి దేశాల్లో వెండి ధరలు పెరగడానికి కారణమైంది.  రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతి ఖర్చులు పెరిగి దేశీయ మార్కెట్ లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

పెట్టుబడికి వెండే బెస్ట్​

ఇన్వెస్టర్లు ప్రస్తుతం బంగారం కంటే వెండి లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  డిజిటల్ రూపంలో కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు వెండి ధర 100 డాలర్ల దిశగా పయనిస్తోంది. ధరలు ఇంత వేగంగా పెరగడం వల్ల కొంతమంది ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్​ ఆసక్తి చూపవచ్చని భావిస్తున్నారు. 

ధరలు మరింత పెరిగే చాన్స్​

వెండి దిగుమతుల పైన ఉన్న ఆంక్షలు,  పారిశ్రామిక రంగం నుంచి పెరుగుతున్న గిరాకీ వల్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.  ఫలితంగా వెండి నగల అమ్మకాలు సుమారు 15 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా.  వెండిని కేవలం నగలుగానే కాకుండా ఒక మంచి పెట్టుబడి మార్గంగా చూసే వాళ్లు పెరగడం వల్ల కాయిన్స్, బిస్కెట్ల అమ్మకాలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.