
కరీంనగర్: కోర్టు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో హైటెన్సన్ వైర్లపై కాకి వాలడం కార్చిచ్చుకు దారితీసింది. సబ్ స్టేషన్ వెనుక భాగాన ఉండే స్టోర్స్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి కాకి ప్రధాన కారణమయింది. స్టోర్స్ పై నుండి 33 కెవి హై టెన్షన్ వైర్ వెళుతోంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆ వైర్ల పై కాకి వచ్చి వాలింది. దాని కదలికలకు స్పార్క్ మొదలై కిందనే ఉన్న స్టోర్స్ చెత్తను అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దాలు రావడం కలకలం రేపింది. ట్రాన్స్ ఫార్మర్లకు అంటుకోవడంతో పేలుళ్ల శబ్దాలు భయాందోళనకు గురిచేశాయి. సుమారు గంటన్నర పాటు పైర్ సిబ్బంది కష్టపడితే తప్ప మంటలు అదుపులోకి రాలేదు. ఫైర్ ఇంజిన్లు వెంటనే చేరుకొని మంటలను అదుపులోకి తెేవడంతో భారీ ప్రమాదం తప్పింది.
మంటలు పక్కనే ఉన్న ఆయిల్ డ్రమ్ములకు అంటుకుని ఉంటే ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండేది. స్థానికులు వెంటనే దీన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మరో వైపు ఫైర్ ఇంజన్ వచ్చే వరకు కూడా స్టోర్ గేటు తాళం తీయలేదు. దీంతో ఫైర్ ఇంజన్ సిబ్బంది వచ్చిన వెంటనే తాళం పగులగొట్టి లోపలికి వెళ్లారు. ఈ ఘటనలో 8 ట్రాన్స్ ఫార్మర్స్ కాలిపోగా స్క్రాప్ కేబుల్స్ కూడా కాలిపోయాయి. ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం ఏడు లక్షలు ఉంటుందని ఎస్ ఈ మాధవరావు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, మేయర్ సునీల్ రావులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.