ఏపీలో ప్రమాదం: లోయలో పడ్డ టెంపో

ఏపీలో ప్రమాదం: లోయలో పడ్డ టెంపో

    ఏడుగురు కర్నాటక వాసులు మృతి

అమరావతి, వెలుగు: ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి,- భద్రాచలం హైవేలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్ట్ టెంపో 20 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. మారేడుమిల్లి – చింతూరు మధ్య ఘాట్ రోడ్డులోని వాల్మీకి సుగ్రీవ కొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్ గా వెళుతున్న టూరిస్ట్ టెంపో  కొండ మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఉదయం 10.30 గంటలకు ప్రమాదం జరిగినా అక్కడ ఫోన్ సిగ్నల్స్ లేక పోలీసులకు ఆలస్యంగా సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరో మహిళ చనిపోయింది. గాయపడ్డ ఐదుగురిని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.

భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా..

ప్రమాదంలో మృతి చెందిన టూరిస్టులు కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె వాసులు. రెండు కుటుంబాలు బంధువులు, మిత్రులతో కలిసి 24 మంది రెండు టెంపోల్లో టూర్ కు బయలుదేరారు. ఒక్కో టెంపోలో 12 మంది   ప్రయాణిస్తున్నారు. భద్రాచలంలో దర్శనం పూర్తి చేసుకున్న మొదటి వాహనం అన్నవరానికి బయలుదేరి వెళ్లింది. ఆలస్యంగా బయలుదేరిన రెండో వాహనం వేగంగా వెళ్లడంతో ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. మృతులు భార్యభర్తలు కుంభం రమేశ్(56), కుంభం అమృతవాణి(53), ఒకే కుటుంబానికి చెందిన మేడా శ్రీనివాసులు(62), మేడా గాయత్రమ్మ (52), ఆమె కూతురు మేడా శ్వేత (25) , మేడా మధురాక్షమ్మ(58), మేడా రామలక్ష్మమ్మ(42) గా పోలీసులు గుర్తించారు.