ఢాకా: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యాపారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. మెమొన్ సింగ్ జిల్లాలోని త్రిశల్‌లో 62 ఏండ్ల వ్యాపారిని గుర్తుతెలియని వ్యక్తులు అతని షాపులోకి చొరబడి నరికి చంపారని స్థానిక మీడియా వెల్లడించింది.
సౌత్‌కంద గ్రామానికి చెందిన సుసేన చంద్ర సర్కార్ త్రిశల్‌లో ‘భాయ్ భాయ్ ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో రైస్ బిజినెస్ చేస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొంతమంది దుండగులు చంద్రసర్కార్ షాపులోకి చొరబడి, అతడిని నరికి చంపారు. షాపులోని నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోయారు. అయితే, చంద్ర సర్కార్ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతన్ని వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో రైస్ షాపులో చూడగా, రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే కుటుంబసభ్యులు హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
ఈ మేరకు చంద్రసర్కార్ కుమారుడు సుజన్ సర్కార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చాలా ఏండ్ల నుంచి తాము త్రిశల్‌లో రైస్ బిజినెస్ చేస్తున్నామని, తమకు ఎవ్వరితోనూ ఎలాంటి కక్షలు లేవని తెలిపారు. తన తండ్రిని చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
