
ఎండలు ఎక్కువుగా ఉన్నాయంటే శరీరాన్ని చల్లబరిచేందుకు మజ్జిగను తాగుతారు. ఇది శరీరానికి పోషకాలు అందిస్తుంది. మజ్జిగతాగడం వలన శరీరం హైడ్రేడ్ గా ఉంటుంది. వేసవి తాపం నుంచి శరీరానికి చల్లదనం ఇస్తుంది. కానీ, పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు నిండివున్న మజ్జిగ కొందరికి మాత్రం అనారోగ్యాన్ని కలిగిస్తుంది.ఎలాంటి వారు మజ్జిగ తాగకూడదో తెలుసుకుందాం. . .
లాక్టోస్ అరగకపోయినా..: లాక్టోస్ అసహనం ఉన్నవారు మజ్జిగ తాగకూడదు. లాక్టోస్ అసహనం అనేది పాలలో ఉన్న లాక్టోస్‌ను శరీరం జీర్ణించుకోలేని పరిస్థితి. లాక్టోస్ అసహనం ఉన్నవారికి వారి శరీరంలో లాక్టోస్‌ను జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్ లాక్టేజ్ ఉండదు. అలాంటి వారు మజ్జిగ తాగితే కడుపునొప్పి, ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వస్తాయి.
గుండె జబ్బులతో బాధ పడేవారు: మజ్జిగలో కొవ్వు పదార్దం ఎక్కువుగా ఉంటుంది. మజ్జిగను ఎక్కువుగా తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హార్ట్ఎటాక్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మైగ్రేన్... తలనొప్పి.. అలర్జీ...మజ్జిగలో టైరమైన్ అనే పదార్దం ఉంటుంది. ఇది మైగ్రేన్.. తలనొప్పికి కారణమవుతుంది. అలెర్జీ ఉన్న వారు కూడా మజ్జిగ తాగకూడదు. పాలు లేదా పాల ఉత్పత్తులకు అలెర్జీ ఉన్నవారికి మజ్జిగ తాగడానికి కూడా అలెర్జీ ప్రతిచర్య ఉండవచ్చు. అలాంటి వారికి మజ్జిగ తాగడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు, శ్వాస ఆడకపోవడం లేదా వాపు రావచ్చు.
అధిక రక్తపోటు : చాలామంది మజ్జిగలో ఉప్పు కలుపుకొని తాగుతారు. బీపీ ఉన్నవారు ఉప్పు కలిసిన మజ్జిగను తాగితే చాలా హానికరం . అందువలన బీపీ పేషెంట్స్ మజ్జిగ తాగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
కిడ్నీల సమస్య ఉన్నవారు: మజ్జిగలో ఉండే పొటాషియం, భాస్వరం పరిమాణం అధికంగా ఉంటుంది. ఇవి మూత్ర పిండాలకు మంచిది కాదు. కాబట్టి మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారికి మజ్జిగ తాగడం హానికరం. అలాంటి వారు వైద్యులను సంప్రదించిన తర్వాతే మజ్జిగ తీసుకోవాలి.