క్యూఆర్ కోడ్​తో ట్రైన్ ​టికెట్ ​కొనుగోలు

క్యూఆర్ కోడ్​తో ట్రైన్ ​టికెట్ ​కొనుగోలు

సికింద్రాబాద్, వెలుగు: రైళ్లల్లో వెళ్లాలనుకునే వారు టికెట్ల కోసం ఇక నుంచి క్యూలైన్లలో నిలబడి నిరీక్షించాల్సిన అవసరం లేదు.స్టేషన్​లోని జనరల్ ​బుకింగ్​కౌంటర్లలో  ఉన్న క్యూఆర్​ కోడ్​ను స్కాన్ చేసి నిమిషాల్లో ట్రైన్ టికెట్ కొనుగోలు చేయొచ్చు. డిజిటల్​ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న దక్షిణ మధ్య రైల్వే.. జనరల్ బుకింగ్ కౌంటర్లలో కొత్తగా నగదు రహిత లావాదేవీలను తీసుకొచ్చింది.  క్యూఆర్​ కోడ్​తో టికెట్లు కొనుగోలు చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా టికెట్ కొనడానికి ప్యాసింజర్లు సరిపడే చిల్లరను తీసుకువెళ్లే అవసరం ఉండదు. తొలిదశలో సికింద్రాబాద్ డివిజన్​కు చెందిన 14 స్టేషన్లలోని 31 కౌంటర్లలో ఈ సదుపాయాన్ని ప్రవేశ పెట్టారు. 

క్యూఆర్ కోడ్ అమలయ్యే స్టేషన్లు

తొలి దశలో భాగంగా  14 ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో క్యూఆర్ కోడ్ అమలు చేస్తున్నారు. అందులో  సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , బేగంపేట, వరంగల్ , మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి,  ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ స్టేషన్లు ఉన్నాయి. డిస్ ప్లే బోర్డులో బయలుదేరే స్టేషన్, చేరుకొనే  స్టేషన్ , ప్రయాణపు తరగతి వివరాలు, పెద్దలు, పిల్లల సంఖ్య తెలిపే వివరాలతో పాటు చార్జీలు  తెలియజేస్తారు. ప్రయాణికులు  చెల్లించవలసిన  చార్జీకి సంబందించిన క్యూ ఆర్ కోడ్ కూడా  డిస్ ప్లే బోర్డులో కనిపిస్తుంది. రైలు వినియోగదారులందరూ సాధారణ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని  దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్​ అరుణ్​కుమార్​ జైన్​ కోరారు.  ఈ విధానం పారదర్శకతకు, కచ్చితత్త్వానికి మైలు రాయిగా నిలుస్తోందని, నగదు చెల్లింపుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని  పేర్కొన్నారు.