కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారు : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి వెలుగు: కేసీఆర్‌‌‌‌‌‌తో సహా బీఆర్ఎస్ లీడర్లందరూ ఫామ్ హౌస్ లకు పరిమితమయ్యారే తప్ప జనాల్లో  లేరని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి  మున్సిపాలిటీ కేంద్రంలో పలు వార్డుల్లో పర్యటించి, సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం  పిల్లయిపల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్ మాజీ ఎంపీటీసీ తో సహా సుమారు 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.  

భూదాన్  పోచంపల్లి మండలంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన సర్పంచులను, వార్డ్ మెంబర్లను ఎమ్మెల్యే శాలువాలతో  సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   గత 40 ఏళ్ల చరిత్రను తిరగరాస్తు భువనగిరి కోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేశామని గుర్తు చేశారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా భువనగిరి నియోజకవర్గంలో గ్రామాల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందన్నారు. 

భువనగిరి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలిచిందని మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఓడిపోయిన ఎమ్మెల్యే ఏడాదిన్నర కాలం ప్రజల ముఖం కూడా చూడకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఈ ప్రోగ్రాంలో మండల అధ్యక్షుడు పాక మల్లేష్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తడక వెంకటేష్ , గెలుపొందిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు, తదితర నాయకులు పాల్గొన్నారు.