అదానీ పెట్టుబడులు, షేర్ల పతనంపై పార్లమెంట్ లో చర్చించాల్సిందే

అదానీ పెట్టుబడులు, షేర్ల పతనంపై పార్లమెంట్ లో చర్చించాల్సిందే

హైదరాబాద్, వెలుగు : అదానీ పెట్టుబడులు, షేర్ల పతనానికి సంబంధించిన అక్రమాలపై పార్లమెంట్ లో చర్చించాల్సిందే అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఏ.విజయ రాఘవన్ డిమాండ్​ చేశారు. అదానీపై చర్చ అంటేనే కేంద్రం భయపడుతున్నదని విమర్శించారు. అదానీపై కుట్ర జరుగుతున్నదని, అక్రమాల్లేవంటూ ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌‌లోని ఎంబీ భవన్‌‌లో సోమవారం సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములుతో కలిసి రాఘవులు, విజయ రాఘవన్ మాట్లాడారు. అదానీకి రూ.80వేల కోట్లు ఎల్‌‌ఐసీ, రూ.25వేల కోట్లు ఎస్‌‌బీఐ రుణం ఇచ్చిందన్నారు. అవి మునిగిపోయినా, చెల్లించకపోయినా ఫర్వాలేదనే భావనలో కేంద్రం ఉందని విమర్శించారు. ప్రజల డబ్బుకు గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు. 16న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపురలో  శాంతియుత పరిస్థితుల్లేవని ఆందోళన వ్యక్తం చేశారు.

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతాం : తమ్మినేని 

ఎన్నికలప్పుడే సీపీఐతో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం ప్రకటించారు. సీపీఐ, సీపీఎం తమతోనే ఉం టాయని, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేది లేదని, ఒకటి లేదా రెండు ఎమ్మెల్సీలు కేటాయిస్తామంటూ బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు అంటున్నారని గుర్తు చేశారు. మంత్రులు కూడా ఇలాగే మాట్లాడుతున్నారని, బీఆర్​ఎస్​ అధిష్టానానికి తెలిసే జరుగుతున్నట్లు తాము అనుకోవడం లేదన్నారు. గతంలో పొత్తు పెట్టుకున్నా.. ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని తెలిపారు.