బై ఎలక్షన్ బాధ్యతలన్నీ బయటి లీడర్లకే

బై ఎలక్షన్ బాధ్యతలన్నీ బయటి లీడర్లకే
  • హుజూరాబాద్ టీఆర్ఎస్ లో కొత్త పోకడ
  • స్థానిక క్యాడర్ పై నమ్మకం లేకే
  • మండలానికో నలుగురు ఎమ్మెల్యేల పర్యవేక్షణ 
  • 50 కుటుంబాలకో ఇన్​చార్జి
  • లోకల్ లీడర్లపై బయటి నాయకుల నిఘా
  • రగిలిపోతున్న లోకల్ లీడర్లు


హుజూరాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు: హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో లోకల్ టీఆర్ఎస్ లీడర్లను పార్టీ పెద్దలు నమ్మడం లేదు. బూత్ లెవల్ నుంచి మండల స్థాయి ఇన్ చార్జి దాకా ఎలక్షన్ బాధ్యతలన్నీ బయటి లీడర్లకే అప్పజెప్పారు. దీనిపై లోకల్ లీడర్లు రగిలిపోతున్నారని తెలిసింది. మీటింగులకు వచ్చే జనాలకు పైసలు పంచడం నుంచి మందు పంపిణీ దాకా అన్నింటా బయటివాళ్లే పెత్తనం చెలాయిస్తుండడంపై వాళ్లు గుర్రుగా ఉన్నారు. తమను కేవలం ప్రచార కార్యకర్తల్లా చూస్తున్నారని, షో మొత్తం బయటివాళ్లే నడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రచారంలో మాత్రమే మమ్మల్ని ముందు పెడుతున్నరు. పై నాయకత్వానికి మాత్రం ‘అంతా మేమే చూసుకుంటున్నం’ అని కలరింగ్ ఇస్తున్నరు. ప్రతి చిన్న ఖర్చుకూ వాళ్ల దగ్గర చెయ్యి చాపాల్సి వస్తున్నది” అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు నియోజకవర్గంలో ప్రతి గ్రామం, లోకల్ లీడర్లు, ప్రజలతో నేరుగా సంబంధాలుండటంపై టీఆర్ఎస్ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఒక్కో మండలానికి నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్ చార్జిలుగా నియమించింది. వీళ్లు ప్రతి గ్రామంలో లోకల్ లీడర్లను తమతోనే తిప్పుకుంటూ విలేజ్ ఇన్ చార్జి బాధ్యతలను మాత్రం బయటి నియోజకవర్గాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, కార్పొరేటర్లకు అప్పగిస్తున్నారు. లోకల్ లీడర్లపై నమ్మకం లేకనే ఇలా చేస్తున్నారనే కామెంట్లు టీఆర్ఎస్ క్యాంపులోనే జోరుగా వినిపిస్తున్నాయి. అలాగే ప్రతి 50 కుటుంబాలకు ఒక ఇన్ చార్జిని నియమించారు. వాళ్లే ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. అయితే ప్రచారానికి ఎమ్మెల్యే అభ్యర్థి, ఇతర లీడర్లు వస్తే మాత్రం లోకల్ లీడర్లే ముందు పడాల్సి వస్తోంది. వాళ్లు చెప్తేనే ఓటర్లు కదులుతున్నారు. ప్రచారానికి వచ్చిన వాళ్ల రోజు కూలీ, భోజనం, మందు తదితర ఖర్చులకు వాళ్లు విలేజ్ ఇన్ చార్జిల మీదనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ విషయంలో ఇన్ చార్జిలే కీలకం కావడం, లోకల్ లీడర్లు డమ్మీలుగా మారడంతో ద్వితీయ శ్రేణి టీఆర్ఎస్ కేడర్ మనసు పెట్టి ప్రచారం చేయడం లేదని సమాచారం.
లోకల్ లీడర్లపై బయటి నాయకుల నిఘా
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న  కొందరు  గ్రామ, మండల స్థాయి లీడర్లు  టీఆర్ఎస్ లోనే కొనసాగేలా తమదైన పద్ధతిలో పావులు కదిపినప్పటికీ వారిని పార్టీ పెద్దలు విశ్వాసంలోకి తీసుకోవడం లేదని తెలిసింది. వారి కదలికలపై ఇంటలిజెన్స్ బృందాలు, బయటి నుంచి వచ్చిన నాయకుల ద్వారా నిఘా పెట్టినట్లు సమాచారం. ఊర్లో నుంచి బయటికి వెళితే ఎవరెవరిని కలుస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, వాళ్ల ఇళ్లకు ఎవరెవరు వచ్చి వెళ్తున్నారని ఒకరికి తెలియకుండా మరొకరితో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఇంతకాలంగా పార్టీని నమ్ముకుని ఉంటే ఇప్పుడిలా అనుమానాలు, అవమానాలు మిగులుతున్నాయంటూ సీనియర్ లీడర్ల దగ్గర లోకల్ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.