టిక్‌టాక్‌ రేసు నుంచి తప్పుకున్న మైక్రోసాఫ్ట్‌

టిక్‌టాక్‌ రేసు నుంచి తప్పుకున్న మైక్రోసాఫ్ట్‌

వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ అమెరికా విభాగాన్ని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ దక్కించుకోలేకపోయింది. మైక్రోసాఫ్ట్ కి అమ్మరాదని చైనాకు చెందిన టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డాన్స్  నిర్ణయించుకుంది. అమెరికాలో తమ కార్యకలాపాల కోసం మరో ఐటీ దిగ్గజం ఒరాకిల్‌ను టెక్నాలజీ భాగస్వామిగా ఎంచుకుంది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది.

‘టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్ కు అమ్మబోమని బైట్‌ డాన్స్ తెలిపినట్లు మైక్రో సాప్ట్ చెప్పింది. మరోవైపు..ఒరాకిల్‌ కేవలం టెక్నాలజీ భాగస్వామిగానే  లేక టిక్‌టాక్‌లో మెజారిటీ వాటాలు కూడా కొనుగోలు చేస్తుందా అన్న విషయంపై స్పష్టత లేదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి.

యూజర్ల డేటా భద్రతపై ఆందోళన క్రమంలో టిక్‌టాక్‌ను సెప్టెంబర్‌ 20లోగా ఏదైనా అమెరికన్‌ కంపెనీకి అమ్మేసి తప్పుకోవాలని, లేకపోతే నిషేధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. దీంతో రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్ తో కలిసి మైక్రోసాఫ్ట్‌.. టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు బరిలోకి దిగింది. అయితే, టెక్నాలజీ బదలాయింపు   సమస్యగా మారింది. మరోవైపు, ఒరాకిల్‌ వ్యవస్థాపకుడు ల్యారీ ఎలిసన్‌తో సన్నిహిత సంబంధాల కారణంగా ఆ కంపెనీకే టిక్‌టాక్‌ను అప్పగించే యోచనలో ట్రంప్‌ ఉన్నట్లు తెలుస్తోంది.