కాంగ్రెస్‌కు ఝలక్: ముస్లిమ్స్‌ని తప్పుదారి పట్టిస్తోందంటూ నేతల రిజైన్

కాంగ్రెస్‌కు ఝలక్: ముస్లిమ్స్‌ని తప్పుదారి పట్టిస్తోందంటూ నేతల రిజైన్

పౌరసత్వ సవరణ చట్టం (CAA)  విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. ఈ చట్టంతో పాటు ఎన్నార్సీని అన్ని పార్టీలు స్వాగతించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి నలుగురు నేతలు రాజీనామా చేశారు. అందులో ఒకరు ముస్లిం లీడర్ కూడా ఉండడం విశేషం.

గోవా రాజధాని పనాజీ కాంగ్రెస్ బ్లాక్ కమిటీ అధ్యక్షుడు ప్రసాద్ అమోంకర్, ఉత్తర గోవా మైనారిటీ సెల్ చీఫ్ షేక్ జావెద్, బ్లాక్ కమిటీ కార్యదర్శి దినేశ్ కుబాల్, మాజీ యూత్ లీడర్ శివరాజ్ తార్కర్.. తాము పార్టీకి రాజీనామా చేస్తున్నామని గురువారం ప్రకటించారు. ఆ తర్వాత వాళ్లు మాట్లాడుతూ తాము CAA, ఎన్నార్సీలకు మద్దతు తెలుపుతున్నామని చెప్పారు.

కాంగ్రెస్ నాయకత్వం పౌరసత్వ చట్టం విషయంలో ప్రజల్ని, ముఖ్యంగా మైనారిటీలను తప్పుదారిపట్టిస్తోందని అన్నారు అమోంకర్. రాజకీయ స్వలాభం కోసం ముస్లింలలో భయాందోళనలను రేపుతోందని కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారాయన. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు విమర్శనాత్మకంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నామని ప్రతిదాన్ని వ్యతిరేకించడం సరికాదని చెప్పారు. CAA, ఎన్నార్సీలపై కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్ కరెక్ట్ కాదన్నారు. పౌరసత్వ చట్టాన్ని కాంగ్రెస్ స్వాగతించాలని హితవు చెప్పారాయన. ‘‘ఇప్పటి వరకూ CAAకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసనల్లో మేము కూడా పాల్గొన్నాం. కానీ పార్టీ నేతలు వాళ్ల స్పీచ్‌లతో మైనారిటీల్లో భయం సృష్టించి.. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకున్నాం. ఇది సరైన పద్ధతి కాదు’’ అని అన్నారు.